నిండు సభలో సారు హామీ.. ఇదైనా నెరవేరుతుందా?

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నది. ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా ఇదిగో కొలువులు.. అదిగో నోటిఫికేషన్లు అని చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు, మంత్రి కేటీఆర్‌కు పరిపాటి అయిందనే విమర్శలున్నాయి. GHMC ఎన్నికలు, నాగార్జునసాగర్​ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ పోరు సమయంలో 50 వేల కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు చెప్పిన ప్రభుత్వం అంతలోనే ఈ అంశాన్ని అటకెక్కించింది. హుజూరాబాద్​ ఉప ఎన్నిక నగారా మోగటంతో మరోమారు కొలువుల అంశం తెరపైకి వచ్చింది. రెండు నెలల్లో […]

Update: 2021-10-05 22:44 GMT

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నది. ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా ఇదిగో కొలువులు.. అదిగో నోటిఫికేషన్లు అని చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు, మంత్రి కేటీఆర్‌కు పరిపాటి అయిందనే విమర్శలున్నాయి. GHMC ఎన్నికలు, నాగార్జునసాగర్​ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ పోరు సమయంలో 50 వేల కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు చెప్పిన ప్రభుత్వం అంతలోనే ఈ అంశాన్ని అటకెక్కించింది. హుజూరాబాద్​ ఉప ఎన్నిక నగారా మోగటంతో మరోమారు కొలువుల అంశం తెరపైకి వచ్చింది. రెండు నెలల్లో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఈ అంశం మరో మారు చర్చకు దారితీసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఏండ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసిన యువతకు అప్పుడప్పుడూ ఆశలు చిగురిస్తుంటాయి. గతేడాది డిసెంబరులో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి రాగానే ప్రగతి భవన్‌లో మీటింగు పెట్టి 50 వేల ఉద్యోగాలంటూ ప్రకటన ఇచ్చారు. రెండు మూడు నెలల్లోనే రిక్రూట్‌మెంట్ జరుగుతుందని ఎదురుచూశారు. కానీ ఆశాభంగమే అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్, ఆ తర్వాత నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ మరోసారి ఉద్యోగాల ప్రస్తావన తెచ్చారు. నోటిఫికేషన్లు ఇదిగో.. అదిగో అంటూ హామీలిచ్చారు. కానీ ఇప్పటికీ నోటిఫికేషన్ రాలేదు. తాజాగా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక దగ్గరికొస్తున్న సమయంలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ రెండు నెలల్లో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు అంటూ నిండు సభలో మంగళవారం ప్రకటించారు. ఇదైనా నెరవేరుతుందో? లేదో! అనేది ఇప్పుడు నిరుద్యోగులకు, యువతను డైలమాలోకి నెట్టింది. కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని, జీవితంలో స్థిరపడదామని కోటి ఆశలతో ఉన్న నిరుద్యోగులకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నది. భవిష్యత్తు కోసం అప్పులు చేసి చదువుతున్నారు. కోచింగ్​ సెంటర్లు, ఇనిస్టిట్యూట్లలో శిక్షణ పొందుతున్నారు. కరోనా టైమ్‌లోనూ ఐదు రూపాయల అన్నపూర్ణ భోజనం తిని సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో కుర్చీలేసుకుని పుస్తకాల పురుగులుగా మారారు. సర్కారు ప్రకటనలే తప్ప నోటిఫికేషన్‌లు మాత్రం రావడమే లేదు. హాస్టళ్లు, స్టడీ సెంటర్లు ఫుల్ అయిపోయాయి.

కోచింగ్ సెంటర్లకు తరలుతున్న యువత

తెలంగాణ ప్రభుత్వం అదిగో ఉద్యోగాలు.. ఇదిగో నోటిఫికేషన్లు అంటూ ఊరించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలప్పుడు ఇదే కనిపించింది. నిజమేనని నమ్మిన యువత ఎంతో ఆశతో కరోనా టైమ్‌లోనూ హైదరాబాద్ బాటపట్టారు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియదు. ఏ స్థాయి ఉద్యోగానికో తెలియదు. ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు. అమీర్‌పేట్, కూకట్పల్లి, దిల్​సుఖ్​నగర్​, అశోక్​ నగర్​, నారాయణగూడ ఇలా అనేక ప్రాంతాల్లోని ఇనిస్టిట్యూట్లలో కాంపిటీటివ్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఒక్క అశోక్ నగర్‌లోనే దాదాపు 100 కు పైగా స్టడీ హాళ్లు నిండిపోయాయి. అమీర్​పేటలో దాదాపు 500కు పైగా కోచింగ్​ సెంటర్లలో నిత్యం క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. నగరంలో దాదాపు ఐదు వేలకుపైగానే ఇనిస్టిట్యూట్లలో వేలాది మంది పోటీ పరీక్షల కోసం కుస్తీ పడుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు. శాఖలవారీగా ఉద్యోగాల వివరాలను బహిరంగ లేఖ రూపంలో విడుదల చేశారు. కానీ పీఆర్సీ నివేదిక ప్రకారం ఇంకా భర్తీ చేయాల్సినవి 1.90 లక్షలు ఉన్నట్లు తేలింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో త్వరలో 50 వేల ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగుల ఓటు బ్యాంకు పొందే ప్రయత్నం చేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎక్కువ మొత్తంలో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులనే భర్తీ చేసింది. ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులను మాత్రం పట్టించుకోవడంలేదు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అంశంగా టేకప్ చేసింది. నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఆందోళన చేపట్టింది. కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల సైతం నిరుద్యోగ అంశాన్నే పట్టుకుని ప్రతి వారం నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తున్నారు.

1.90 లక్షలు భర్తీ చేసేదెన్నడు?

“పీఆర్సీ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.90 లక్షలకు పైగా ఖాళీలున్నాయి. తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇక మిగతా ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఒక్క పొలీస్ శాఖలో మాత్రమే కాస్తో కూస్తో నోటిఫికేషన్లు వచ్చాయి. ఇక వేరే శాఖల్లో ఉన్న ఖాళీలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. నిరుద్యోగులకు చావులే దిక్కయ్యేలా ఉన్నాయి.’’ – నగేశ్, నిరుద్యోగి, నారాయణ గూడ.

రాష్ట్రం వచ్చినా ఇబ్బందులే..

“రాష్ట్రంలో శాఖలవారీగా 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల రేషనలైజేషన్, ఉద్యోగుల జోనల్ డివిజన్ ప్రక్రియ పూర్తయితే ఖాళీల లెక్క తేలుతుందని ప్రభుత్వం చెప్తున్నది. సీఎం గతేడాది డిసెంబరులో ప్రకటన చేసి దాదాపు పది నెలలు దాటింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలన్నీ మనకేనంటూ ఉద్యమం సమయంలో కేసీఆర్ హామీలు ఇచ్చారు. కానీ ఆచరణ భిన్నంగా ఉండడంతో ఉద్యోగాలు రావనే నిరాశతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు”

Tags:    

Similar News