సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. దళితులకు రూ. 40 వేల కోట్లు..!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు, ఆసరా పింఛన్ల తరహాలోనే అట్టడుగున ఉన్న దళిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నగదు రూపంలో ఆర్థిక సాయం అందించడానికి లబ్ధిదారుల ఎంపిక, కుటుంబాల లెక్కింపు జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అట్టడుగున ఉన్నవారి నుంచి ఈ సాయాన్ని ప్రారంభించి వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, అదనంగా మరో […]

Update: 2021-06-27 04:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు, ఆసరా పింఛన్ల తరహాలోనే అట్టడుగున ఉన్న దళిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నగదు రూపంలో ఆర్థిక సాయం అందించడానికి లబ్ధిదారుల ఎంపిక, కుటుంబాల లెక్కింపు జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అట్టడుగున ఉన్నవారి నుంచి ఈ సాయాన్ని ప్రారంభించి వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, అదనంగా మరో రూ. 500 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని, రానున్న నాలుగేళ్ళలో సుమారు రూ. 40 వేల కోట్లను ఖర్చు పెట్టాలనుకుంటున్నదని వివరించారు. ప్రగతి భవన్‌లో దళిత సాధికారతపై ఆ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమావేశం సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

ఈ పథకం కింద నగదు సాయం అందుకోవాల్సిన కుటుంబాల అర్హతను తేల్చాలంటే ముందుగా దళిత కుటుంబాల గణన ప్రారంభించాల్సి ఉన్నదన్నారు. ఎన్ని కుటుంబాలకు సాయం అందించాలి, ప్రభుత్వం అనుకుంటున్న విధానంలో ఎన్ని కుటుంబాలు అర్హమైనవిగా ఉంటాయి తదితరాలపై వారితో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాల్లోని సమస్యలను విడివిడిగా గుర్తించి తగిన పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సొల్యూషన్ వెదకాలన్నారు. ఇది సాకారం కావాలంటే దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం అమలుకు తగిన కార్యాచరణ రూపొందాల్సి ఉన్నదన్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద కేటాయించాలనుకుంటున్న నిధులన్నీ ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు అదనం అని సీఎం వివరించారు.

గోరటి వెంకన్న పాటతో పరిష్కారం

భూమి ఉత్పత్తి సాధనంగా ఇంతకాలం జీవనోపాధి జరిగిందని, కానీ మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో కూడా మార్పు వచ్చిందని, దళిత యువత ఇప్పుడు స్వయం ఉపాధి దిశగా అన్వేషణ జరపాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఇందుకోసం ప్రభుత్వం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రాసి పాడిన ‘గల్లీ చిన్నది… ‘ అనే పాటను మనసు పెటటి వింటే పల్లె బతుకులు, సమాజ పరిణామ క్రమంలో వచ్చిన మార్పులు అర్థమవుతాయని, వాటికి తగినట్లుగా దళితుల సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందన్నారు. దళితులకు ఆర్థిక స్వావలంబన చేకూర్చి వారికి సాధికారత కల్పించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించిందని, అందుకు పార్టీలకు అతీతంగా దళితుల, మేధావుల, ప్రజా ప్రతినిధుల సహకారం కావాలని కోరారు. ఈ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయాలన్నదే ముఖ్యమంత్రి స్థాయిలో తన దృఢ సంకల్పం అని నొక్కిచెప్పారు.

వ్యక్తిగతంగా హాజరైన మోత్కుపల్లి

దళిత సాధికారతపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని బీజేపీ ఒక పార్టీగా బహిష్కరించింది. కానీ ఆ పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత హోదాలో మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటికీ, విధానపరంగా ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినప్పటికీ మోత్కుపల్లి హాజరుకావడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఆయనను వ్యక్తిగత హోదాలోనే పిలిచిందని, ఆ హోదాలోనే హాజరయ్యారని ప్రగతిభవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత, గిరిజన ఎమ్మెల్యేలకు ఆహ్వానం ఉన్నా ఒక్క భట్టి విక్రమార్క మాత్రమే హాజరయ్యారు. మూడు రోజుల క్రితం ప్రగతి భవన్ వెళ్ళి సీఎం కేసీఆర్‌ను కలవడంపై పార్టీలో భారీ స్థాయిలోనే చర్చలు జరిగిన తర్వాత భట్టి ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చని తెలిసింది. కానీ సీఎల్పీ నేత హోదాలో ఆయన ఒక్కరే కాంగ్రెస్ ప్రతినిధిగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎంలకు దళిత ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు.

Tags:    

Similar News