‘ధరణి’కి చికిత్స

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించేలా ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ధరణి పోర్టల్ పవర్ ఫుల్. ఆన్లైన్ డేటాయే సూపర్ పవర్. దానికి సర్వాధికారి తహసీల్దార్. కొత్త ఆర్వోఆర్ చట్టం ఇదే చెబుతోంది. ఆటోమెటిక్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలో కీలక భూమిక పోషించనున్న ‘ధరణి’ నిర్వహణ గురించి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు ఈ సమావేశానికి సమగ్ర […]

Update: 2020-09-22 00:37 GMT
‘ధరణి’కి చికిత్స
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించేలా ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ధరణి పోర్టల్ పవర్ ఫుల్. ఆన్లైన్ డేటాయే సూపర్ పవర్. దానికి సర్వాధికారి తహసీల్దార్. కొత్త ఆర్వోఆర్ చట్టం ఇదే చెబుతోంది. ఆటోమెటిక్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలో కీలక భూమిక పోషించనున్న ‘ధరణి’ నిర్వహణ గురించి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని ఆదేశించినట్లు తెలిసింది. ధరణిలో క్రోఢీకరించిన డేటాలో అనేక తప్పులు ఉన్నాయి. వాటిని యథాతథంగా అమలు చేయడం ద్వారా ఇబ్బందులు తలెత్తుతాయని రెవెన్యూ యంత్రాంగమంతా స్పష్టం చేస్తోంది.

సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మాత్రం ఎవరికీ ధైర్యం సరిపోవడం లేదు. అక్కడ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులంతా మేధావులే. వారికి ఉచిత సలహాలు, సూచనలు ఇచ్చి భంగపడడమేనన్న అభిప్రాయం నెలకొంది. అడగకుండానే ‘ధరణి’లోని లోపాలను ఎత్తిచూపిస్తే ఎక్కడ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ఇటీవల ఈ చట్టం గైడ్ లైన్స్ రూపకల్పనకు జాతీయస్థాయిలో సమగ్ర అవగాహన కలిగిన ఓ ప్రొఫెసర్ ను సీఎంఓకు ఆహ్వానించారు. ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆ తర్వాత ఆయనకు ఆహ్వానం లేకుండా పోయినట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించిన మేధావులు, కీలకంగా పని చేసినవారే సీఎం సమీక్షలోనూ కూర్చోనున్నారని తెలిసింది. చట్టంలోని లేని అంశాలపై ఆర్డినెన్స్ తీసుకొస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన అమలవుతుందా? లేక గైడ్ లైన్స్ లోనే వెసులుబాటు కల్పిస్తారా వేచి చూడాలి.

తప్పుల సవరింపు దిశగా

సేత్వార్ ఆధారంగానే ధరణి వెబ్ సైట్లో ప్రతి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను నమోదు చేశారు. అధికంగా విస్తీర్ణం నమోదు చేసిన (పాస్ పుస్తకాల ద్వారా) సర్వే నంబర్ల మ్యూటేషన్లు సాధ్యం కావు. సాంకేతిక సమస్యలతోనే భూ యాజమాన్య హక్కులకు సమస్యలు తలెత్తుతాయి. అసలు భూమి ఉన్నా లేకున్నా పాస్ బుక్కులివ్వడం, భూమి అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా నమోదు చేయకపోవడంతో అంతా గందరగోళంలో పడింది. ఈ అదనపు భూమి రికార్డుల్లో ఉంది. ప్రత్యక్షంగా లేదు. ఈ క్రమంలో గైడ్ లైన్స్ లో ఏ విధి విధానాలను ప్రకటిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అనుసంధాన ప్రక్రియపైన సమీక్షలో చర్చ జరగనున్నట్లు తెలిసింది.

సమాధానాల్లేని రెండు ప్రశ్నలు

‘ధరణి’ పోర్టల్ రూపకల్పనకు రెఫరెన్స్ పాయింట్ ఏమిటి? మాన్యువల్ రికార్డు ఉన్నదా? ఏటా మార్పుల రికార్డులను తయారు చేసే రెవెన్యూ వ్యవస్థకు ఫైనల్ డేటాగా క్రోఢీకరించిన పోర్టల్ కు డిజిటల్ కాపీ ఉన్నదా? వేటి ఆధారంగా రూపొందించారు? ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు భూముల కంప్యూటీకరణకు రెండేండ్లు, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండేండ్లు కష్టపడ్డారు. ఆ తర్వాత ‘మీ ఇంటికి మీ భూమి’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. నాలుగేండ్లు శ్రమించినా అనేక పొరపాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దడానికి అవకాశం కల్పించారు. దాని ఆధారంగా కోటి తప్పులను సవరించినట్లు ఏపీ ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని రెవెన్యూ చట్టాల నిపుణుడు ప్రొ.ఎం.సునీల్ కుమార్ అన్నారు. మరి ఇక్కడ రూపొందించిన ‘ధరణి’ డేటా ఫైనల్ అంటున్నారు. తప్పొప్పులను సవరించుకోవడానికి హక్కుదారులకు అవకాశం కల్పించారా? కల్పిస్తే ఎన్నింటిని కరెక్షన్ చేశారు? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News