కరోనాతో భయమొద్దు.. కలిసి జీవిద్దాం: కేసీఆర్

దిశ, న్యూస్ బ్యూరో: “కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ సోకినప్పటికీ కోలుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించినవారి శాతం కేవలం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదు” అని ముఖ్యమంత్రి […]

Update: 2020-05-15 11:34 GMT

దిశ, న్యూస్ బ్యూరో: “కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ సోకినప్పటికీ కోలుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించినవారి శాతం కేవలం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప రాష్ట్రంలో మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని, ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్ నిబంధనలను యధావిధిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచే ఎసి దుకాణాలు, ఆటోమోబైల్ షో రూములు, స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17తో ముగుస్తున్న దేశవ్యాప్త లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహాన్ని ఖరారు చేస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా పై విధంగా వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ నగరంలో ఎల్‌బి నగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో మినహా రాష్ట్రంలో మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని సీఎం నొక్కి చెప్పారు. ఈ జోన్లలో 1442 కుటుంబాలున్నాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొద్దిమంది వలస కూలీలకు వైరస్ సోకినట్లు తేలిందని, కానీ ఆ జిల్లాలో ఎవరికీ పాజిటివ్ లేదన్నారు. పాజిటివ్ వచ్చిన వలస కూలీలు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఉన్నట్లు పరిగణించలేమన్నారు. పాజిటివ్ కేసులున్న నాలుగు కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. లక్షణాలున్నవారికి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నామని వివరించారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త

విదేశాల నుంచి వచ్చేవారు, వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకునే తెలంగాణ వాసులకు పరీక్షలు నిర్వహించాలని, వైరస్ ఉన్నట్లు తేలితే వెంటనే ఆసుపత్రికి తరలించాలని స్పష్టం చేశారు. వైరస్ లేనట్లయితే వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచాలన్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని అక్కడి నుంచే నేరుగా ప్రత్యేక బస్సుల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు పంపించాలన్నారు. రైళ్ల ద్వారా తెలంగాణకు చేరుకునే వలస కార్మికులకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు చేరుకున్న వలస కార్మికుల్లో ఇప్పటివరకు 44 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. విమానాల ద్వారా ఇతర దేశాల నుంచి వచ్చినవారు హోటళ్ళలో, ఇళ్ళల్లో క్వారంటైన్‌లో ఉన్నారు. తొలుత విదేశాల నుంచి, ఆ తర్వాత మర్కజ్ నుంచి వచ్చినవారి ద్వారా వైరస్ రాష్ట్రానికి వ్యాపించింది. మళ్ళీ ఇప్పుడు విదేశీ ప్రయాణీకుల ద్వారా, వలస కార్మికుల ద్వారా రాష్ట్రంలోకి తిరిగి వస్తోంది.

సీజనల్ వ్యాధులతో అప్రమత్తం

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మే నెల చివరి నాటికి రెండు సార్లు, జూన్ నెలలో ఐదు సార్లు పిచికారి చేయాలని సూచించారు. పరిసరాల్లో చెత్తా చెదారాన్ని తొలగించాలని, దోమలు రాకుండా విరివిగా ఫాగింగ్ చేయాలని నొక్కిచెప్పారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇది కరోనా వ్యాప్తి నివారణకు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందన్నారు. పట్టణాల్లో మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జడ్పిటిసి, జడ్పీ చైర్‌పర్సన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రజలను కూడా చైతన్య పరచి ప్రభుత్వం యంత్రాంగంతో పని చేయించాలని సూచించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టణాలు, గ్రామాల పారిశుధ్య పనులపై తగిన సూచనలు చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణకు చర్యలను కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేకున్నా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు, ఇతర అత్యవసర పనులు చేయడానికి ప్రభుత్వం నిధుల కొరత లేకుండా చేస్తున్నదన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన నిధులను ఇప్పటికే విడుదల చేశామని, జూన్ మాసానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20 నుంచి హరితహారం కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని, ప్రస్తుతం నడుస్తున్న 123 బస్తీ దవాఖానాలకు అదనంగా మరో 45 బస్తీ దవాఖానాలను వెంటనే ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లను ఆదేశించారు.

రేపు గోదావరిపై ప్రత్యేక సమావేశం

రానున్న వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను సమర్ధవంతంగా వినియోగించుకునేలా పకడ్బందీ ప్రణాళికను రూపొందించేందుకు ఆదివారం సీఎం అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. గోదావరిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఎప్పుడు ఎంత నీటిని విడుదల చేయాలి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, లోయర్ మానేరు డ్యామ్ తదితరాలకు నీటిని ఎప్పుడు తరలించాలి, మిగిలిన రిజర్వాయర్లకు ఎప్పుడు వదలాలి, ఆ నీటిని ఎలా వాడుకోవాలి తదితర అనేక అంశాలను ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు. మ,త్రులు ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జగీదశ్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. పలు ప్రాజెక్టుల ఇంజనీర్లు కూడా ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నారు. ఈ సమావేశంలో స్పష్టత వచ్చిన తర్వాత కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అనుసరించే విధానంపైనా సీఎం మరో సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నారు.

నేటి నుంచి ఏసీ, ఆటోమొబైల్ దుకాణాలు ఓపెన్ :

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసి (ఎయిర్ కండిషనర్లు) అమ్మే షాపులు, ఆటోమోబైల్ షో రూములు, ఆటో మోబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు యధావిధిగా నడుస్తాయి. ఇప్పటికే కరెంటు, సిమెంటు, ఇనుము, హార్డ్‌వేర్ దుకాణాలు తెరుచుకున్నాయి. భవన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పరిశ్రమలు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అన్ని రకాల దుకాణాలు యధావిధిగా నడుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో సైతం కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలినచోట్ల దుకాణాలు యధావిధిగా పనిచేయించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ నెల 17వ తేదీకల్లా కేంద్రం నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా విధాన నిర్ణయం తీసుకోనుంది. అప్పటివరకు లాక్‌డౌన్ నిబంధనలు యధావిధిగా అమలవుతాయి. ఈ నెల 17న కేంద్రప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి తగిన వ్యూహాన్ని ఖరారు చేసి, ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

Tags:    

Similar News