Lockdown : ఈ నెల 30న కేసీఆర్ కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీతో ముగుస్తున్నందున తదుపరి నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ ద్వారా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని, మంచి ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. మరింతగా కంట్రోల్‌లోకి రావడానికి ఇంకో వారం రోజుల పాటు పొడిగించాల్సిన […]
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీతో ముగుస్తున్నందున తదుపరి నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ ద్వారా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని, మంచి ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. మరింతగా కంట్రోల్‌లోకి రావడానికి ఇంకో వారం రోజుల పాటు పొడిగించాల్సిన ఆవశ్యకతపై ఈ సమావేశంలో సీఎం చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమావేశంలో ధాన్యం కొనుగోళ్ళు, వానాకాలం పంటకు విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం తదితర అంశాలపై చర్చ జరగనుంది.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం వారం రోజుల పాటు పొడిగించడం ఉత్తమమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా తక్కువగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ శాఖ అధికారులకు సీఎం సూచించారు. ప్రస్తుతం ఐదు శాతంలోపే ఉన్నందున ఇప్పుడు కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను యధావిధిగా మరో వారం పాటు పొడిగించి కొత్త కేసులు మూడంకెల స్థాయి వరకు వచ్చేలా చూడడమా? లేక వీకెండ్ లాక్‌డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ లాంటి వాటితో కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందా? అనేదానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
గత నెల 20 నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలవుతుండగా.. ఈ నెల 12వ తేదీ నుంచి లాక్‌డౌన్ కొనసాగుతూ ఉంది. అయినా రోడ్లమీద వాహనాల రాకపోకలు పెరిగిపోయాయని అభిప్రాయపడిన సీఎం కేసీఆర్.. ఇటీవల జిల్లా కలెక్టర్లు, ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులతో మాట్లాడి కఠినంగా అమలు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిని ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే కేబినెట్ భేటీలో చర్చించి లాక్‌డౌన్‌పై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.