జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేసీఆర్

ఏపీ తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణా నది మీద పోతిరెడ్డిపాడు, ఇతర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే తాము కూడా అలంపూర్-పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రోజుకు మూడు టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో వాడీవేడి వాదనలు జరిగాయి. మంగళవారం వెబినార్‌తో జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి […]

Update: 2020-10-06 21:31 GMT
ఏపీ తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణా నది మీద పోతిరెడ్డిపాడు, ఇతర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే తాము కూడా అలంపూర్-పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రోజుకు మూడు టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో వాడీవేడి వాదనలు జరిగాయి. మంగళవారం వెబినార్‌తో జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు గట్టిగా వాదనలు వినిపించాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: వాడీవేడిగా జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోతలకు అనుమతులు లేవని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. దీంతో సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అసలు అనుమతులే లేవని, మొదటి ప్రాజెక్ట్‌‌కే అనుమతి లేనప్పుడు రెండోది ఎలా చేపడుతారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి షెకావత్ ఇద్దరికీ సర్దిచెప్పారు. అనంతరం డీపీఆర్‌లు సమర్పిస్తే కేంద్రం అన్ని ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటుందని షెకావత్ తేల్చి చెప్పగా, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధమని సీఎంలు చెప్పారు. అనంతరం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన వాదనలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు.

పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ..

నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఏపీ వ్యవహరిస్తే ఇక నుంచి కుదరదని, క్రమశిక్షణను ఉల్లంఘించి తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమని గుర్తు చేశారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర నదీ జలాల్లో న్యాయమైన వాటాను పొందే హక్కు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామని స్పష్టం చేశారు.
కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశామని, స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించడం బాధాకరమని చెప్పారు. ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్‌ను ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోతిరెడ్డిపాడును మరింత విస్తరించడాన్ని వ్యతిరేకించారు.

కొత్త ప్రాజెక్టులు లేవు..

తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నదీ జలాల వివరాలను సోదాహరణంగా కేంద్రానికి వివరించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ప్రారంభంలోనే ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఏడాది పాటు వేచిచూసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనిపై కేంద్రమంత్రి షెకావత్ తెలంగాణ డిమాండ్‌ను అంగీకరిస్తామని చెప్పారని, సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసి ఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేక పోతున్నామన్నారని వివరించారు. కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే సుప్రీం కోర్టులో కేసును వెనక్కి తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం సీఎం కేసీఆర్ వెల్లడించారు.
పునర్విభజన చట్టం 2004, సెక్షన్ 89 కింద కృష్ణా నదీ జలాల వివాద ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటి-2కు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏర్పాటు చేయాలని, దీంతో ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు. అంతర బేసిన్లలోనే నదీ జలాలను తరలించాలనే జల న్యాయ సూత్రాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. ఒక నదీ బేసిన్‌లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే ఇంకా అదనపు జలాలుంటేనే బేసిన్ అవతలికి నదీ జలాలను తరలించే అంశాన్ని పరిగణlలోకి తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గ నిర్దేశనాలను వివరించారు. బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఏపీకి లేదనీ, ఇదే విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖతోపాటు కేఆర్ఎంబీ ఏపీకి స్పష్టం చేయడాన్ని సరైన చర్యగా సీఎం అభివర్ణించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైందని, తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరి నదీమీద ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

డీపీఆర్‌లిచ్చేందుకు అభ్యంతరం లేదు..

ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్రమంత్రి కోరారని, తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేననీ, రహస్యం ఏమీ లేదని, నిర్మాణ క్రమానికి అనుగుణమైన స్వల్ప మార్పులు చోటు చేసుకుంటుండటంతో డీపీఆర్‌లు సమర్పించడంలో కొంత సమయం తీసుకోవాల్సి వస్తుందని సీఎం చెప్పారు. అంతేతప్ప డీపీఆర్‌లు సమర్పించడానికి తమకు ఏ అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. గోదావరి నదిపై (జీడబ్లూడీటీ) అవార్డు ప్రకారం నాటి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవహిస్తున్న మొత్తం నీటిని వినియోగించుకోవచ్చని ఉందని, ఒకవేళ ఏపీకి ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే 1956 చట్టం కింద ట్రిబ్యునల్‌కు నివేదించుకోవచ్చన్నారు. దీనిపై కేంద్రమంత్రి రెండు రాష్ట్రాలు కలిసి లేఖ ఇస్తే గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
మేం సహకరిస్తాం.. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్రం ముందుకు వస్తే తెలంగాణ సంపూర్ణంగా సహకరిస్తుందని, బోర్డులు సమర్థవంతంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు జరిపి, వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందన్నారు.
నాలుగేండ్ల కింద మొదటిసారి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలను సరిగా నమోదు చేయలేదని, రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జరిపిన చర్చను, తీసుకున్న నిర్ణయాలను వీడియో రాతపూర్వకంగా నమోదు చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఆరేండ్లుగా పెండింగులో ఉన్న సెక్షన్ 3 ద్వారా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశం తెలంగాణ ఒత్తిడి మేరకు రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పరిష్కారం కావడం తెలంగాణకు సాగునీటి జలాల వినియోగం విషయంలో మేలు చేకూర్చే అంశమని సీఎం చెప్పారు. తెలంగాణ ఫిర్యాదులు ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారమైతే కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రెటరీలు నర్సింగ్‌రావు, రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితాబర్వాల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఎస్కే జోషీ, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్‌పాండే, ఈఎన్సీ మురళీధర్‌రావు పాల్గొన్నారు.
Tags:    

Similar News