జగన్ సీరియస్.. రంగంలోకి బాబాయ్
దిశ, ఏపీ బ్యూరో: రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న లొల్లి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయాలు మారిపోయాయి. గత కొంతకాలంగా మెుదలైన రాజకీయ విభేదాలు నేడు బట్టబయలయ్యాయి. మీడియా సాక్షిగా ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు బహిరంగ విమర్శలకు దిగడంతో పార్టీ పరువు కాస్త రోడ్డుమీదకొచ్చింది. పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే… చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసునంటూ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. […]
దిశ, ఏపీ బ్యూరో: రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న లొల్లి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయాలు మారిపోయాయి. గత కొంతకాలంగా మెుదలైన రాజకీయ విభేదాలు నేడు బట్టబయలయ్యాయి. మీడియా సాక్షిగా ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు బహిరంగ విమర్శలకు దిగడంతో పార్టీ పరువు కాస్త రోడ్డుమీదకొచ్చింది. పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే… చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసునంటూ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ వైసీపీని ఓ కుదుపుకుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగంలోకి వైవీ సుబ్బారెడ్డి
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య నెలకొన్న విభేదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ఇద్దరు నేతల వల్ల పార్టీ పరువుపోతుందంటూ మండిపడ్డారు. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదర్చాలని తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగారు. మంగళవారం ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని చర్చించారు. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలపై ఆరా తీశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు ఇద్దరినీ తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
చిచ్చు రేపిన ఆవభూముల వ్యవహారం
ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజాల మధ్య పొలిటికల్ వార్‌కు బూరుగపూడి ఆవభూములే కారణమని తెలుస్తోంది. బూరుగపూడి ఆవ భూముల కొనుగోళ్లలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌తో కలిసి భరత్ అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే రాజా సంచలన ఆరోపణలు చేశారు. ఆవ భూముల తరహాలోని పురుషోత్తపట్నం రైతుల నుంచి డబ్బులు దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజా ధ్వజమెత్తారు. అయితే రాజా ఆరోపణలపై భరత్ మండిపడ్డారు. తాను నిస్వార్థంగా పనిచేస్తున్నానని ‘మీరు చిటికేస్తే వచ్చేవాళ్లు ఎవరంటూ ఎంపీ భరత్ ప్రశ్నించారు.
మరోవైపు ఎంపీ భరత్ టీడీపీ నాయకులతో కుమ్మక్కై తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్య రాజా ఆరోపిస్తే చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసునంటూ ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌ను ఇబ్బందులకు గురి చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో భరత్ సెల్ఫీలు తీసుకున్నారని ఆరోపిస్తే… తాను అసలు సెల్ఫీ తీసుకోలేదని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ భరత్ కౌంటర్ ఇచ్చారు. కాపు సమావేశంలో ఆయనను కలిశానని తాను పార్లమెంట్‌లో చాలా బాగా మాట్లాడానని లక్ష్మీనారాయణ కితాబిచ్చారని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్‌ల మధ్య ఏర్పడిన వివాదంపై విచారణ జరపాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య ఏర్పడిన రాజకీయ వివాదం కన్నా.. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫిర్యాదులపై విచారణ జరిపించాలన్నారు. ఆవ భూముల కుంభకోణం విషయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్యమంత్రి జగన్‌కు లెక్కలతో సహా లేఖలు రాసినా విచారణ జరిపించకపోవడం వెనుక ఉద్దేశం ఏంటని నిలదీసిన సంగతి తెలిసిందే. మరి వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగడంతో విభేదాలు తొలగిపోతాయా లేక ఇలాగే వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి.