టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు.. ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. కారుకు బ్రేకులు.?
దిశ ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల జోష్ పెరిగింది. గత వారం పది రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు ఊపందుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఊపు వచ్చింది. అయితే సంస్థాగత ఎన్నికలతో పార్టీకి కలిసి వస్తుందా.. లేక కొత్త విభేదాలు బయటపడనున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు నడుస్తోంది. దీని కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న నేటికీ గ్రామస్థాయిలో పార్టీ […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల జోష్ పెరిగింది. గత వారం పది రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు ఊపందుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఊపు వచ్చింది. అయితే సంస్థాగత ఎన్నికలతో పార్టీకి కలిసి వస్తుందా.. లేక కొత్త విభేదాలు బయటపడనున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు నడుస్తోంది. దీని కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న నేటికీ గ్రామస్థాయిలో పార్టీ బలంగా పునాదులు వేసుకోలేకపోవడానికి అంతర్గత పోరే కారణమన్నది ఎవ్వరూ కాదనలేని విషయం. అయితే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికల కారణంగా ఆ విబేధాలు రచ్చకెక్కుతాయా.. లేక మరోవైపునకు దారితీస్తాయా అన్నది వేచిచూడాలి.
వర్గపోరు సమస్యే ఎక్కువ..
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ప్రధాన సమస్యగా మారింది. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేకపోయిందనేది బహిరంగ రహస్యమే. నకిరేకల్, కోదాడ, నాగార్జునసాగర్, తుంగతుర్తి, మునుగోడు, దేవరకొండ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో వర్గపోరు తారస్థాయిలో ఉంది. ఇప్పటికే పలుమార్లు ఈ నియోజకవర్గాల్లో వర్గ విబేధాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సాగుతున్న సంస్థాగత ఎన్నికల్లో ఏ వర్గానికి పెద్దపీట వేస్తారు..? ఏ వర్గాన్ని పక్కనపెడతారనే చర్చ ప్రధానంగా సాగుతోంది. మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా.. నకిరేకల్ నియోజకవర్గానిది ప్రత్యేక పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి, మాజీ ఎమ్మెల్యే వేముల వర్గాలు బలంగా ఉండడంతో ఎవ్వరికీ ప్రాధాన్యం ఉంటుందనేది ఆసక్తిగా మారింది. నిజానికి ఎమ్మెల్యేపైనే పార్టీ పగ్గాలు మండలాలు, గ్రామాల్లో ఎవ్వరికీ కట్టబెట్టాలనే బాధ్యత ఉంటుంది. కానీ నకిరేకల్ నియోజకవర్గంలో గ్రామస్థాయిలో వీరేశం వర్గీయులు బలంగా ఉండడంతో అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవం కానివ్వడం కష్టమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొత్త సమస్యలొచ్చేనా..?
టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు సమన్వయ సమితులు, నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కని నేతలంతా పార్టీ సంస్థాగత ఎన్నికలపైనే దృష్టి సారించారు. దాదాపు ఏడున్నరేండ్లుగా ఇకనైనా పదవి దక్కపోతుందా ఆశతో నెట్టుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు ఇతర పార్టీలు తమ బలం పెంచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలందరితోనూ టచ్‌లో ఉన్నారు. ఏ క్షణంలో వీలుచిక్కినా అధికార పార్టీ నుంచి జంప్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తి నేతలకు పార్టీ పదవులు దక్కకపోతే పరిస్థితి ఏంటనే భయం కొంత లేకపోలేదు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఎవ్వరికీ పదవులు ఇవ్వాలి..? ఎవ్వరిని బుజ్జగించాలో తెలియడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులు కొత్త చిచ్చు పెట్టేలా ఉందని సన్నిహితులతో వాపోతున్నట్టు సమాచారం.