యాచకుల మధ్య ఘర్షణ… ఒకరి హత్య..

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కరోనా లాక్‌డౌన్ సమయంలో రోడ్డుపై వాహనాల రద్ధీ కొనసాగుతున్న సమయంలో రోడ్డు పక్కనే ఇద్దరు యాచకులు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి అందులో ఒకరు వాడిపారేసిన రోకలి బండతో ప్రత్యర్థి తల మీద బలంగా కొట్టి హత్య చేసిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రెడ్డి (40) పేరుతో పిలువబడే ఓ వ్యక్తి (అసలు పేరు తెలియదు) చాదర్‌ఘాట్ సాయిబాబా ఆలయంలో అన్నదానంలో […]

Update: 2021-06-01 08:46 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కరోనా లాక్‌డౌన్ సమయంలో రోడ్డుపై వాహనాల రద్ధీ కొనసాగుతున్న సమయంలో రోడ్డు పక్కనే ఇద్దరు యాచకులు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి అందులో ఒకరు వాడిపారేసిన రోకలి బండతో ప్రత్యర్థి తల మీద బలంగా కొట్టి హత్య చేసిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రెడ్డి (40) పేరుతో పిలువబడే ఓ వ్యక్తి (అసలు పేరు తెలియదు) చాదర్‌ఘాట్ సాయిబాబా ఆలయంలో అన్నదానంలో పెట్టే భోజనం తింటూ వీపీజీ వద్ద ఫుట్‌పాత్ పైనే నిద్రించేవాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో వీపీజీ వద్ద మరో యాచకుడు నేపాలి (ఇతని అసలు పేరు కూడా తెలియదు)తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన పడేసిన పాత రోకలి బండతో నేపాలి రెడ్డి తలపై బలంగా కొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

అనంతరం నేపాలి అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్ ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి, సుల్తాన్ బజార్ ఇన్ స్పెక్టర్ సుబ్బరామిరెడ్డిలు సంఘటనా స్థలికి చేరుకున్నారు. తలకు తీవ్ర గాయమై మృతి చెంది పడిఉన్న రెడ్డి మృతదేహానికి శవపంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా హత్యకు పాల్పడిన నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్ మాట్లాడుతూ.. రోకలి బండతో తలపై మోది హత్య చేసిన నిందితుడు పేరు కూడా చెప్పలేకపోతున్నాడని అన్నారు. తన పేరు నేపాలి అని మాత్రమే చెబుతున్నాడని, హత్యకు గల కారణాలు కూడా వెల్లడించడం లేదన్నారు. సంఘటనా స్థలంలో రోడ్డుకు సాయిబాబా గుడి పైపున మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. మరో వైపు లేకపోవడంతో వారి మధ్య గొడవకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, విచారణ అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

వైట్నరే కారణమా…?

చాదర్ ఘాట్, సీబీఎస్, ఎంజీబీఎస్, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాలలో అడుక్కుని వచ్చిన మొత్తంతో వైట్నర్ కొనుగోలు చేసి ఎప్పుడు మత్తులో ఉండేవారు అధికం. వైట్నర్ మత్తులో వారిలో వారే ఘర్షణ పడి చిన్న కారణాలతో హత్యలు చేసిన సంఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. అయినా ఆయా ప్రాంతాలలో పోలీసుల నిఘా కొరవడడంతో వీరి గొడవలకు అంతేలేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉస్మానియా ఆస్పత్రి, ఎంజీబీఎస్ ప్రాంతాలలో రోడ్లపై అడుక్కుని తింటూ అదును చూసి దొంగతనాలకు పాల్పడే వారి ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి.

Tags:    

Similar News