ప్రాజెక్టుల రక్షణకు CISF బలగాలు.. గెజిట్‌కు ముందే..!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలు మోహరించనున్నాయి. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడానికి ముందే సీఐఎస్‌ఎఫ్ బలగాలను దింపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఏ ప్రాజెక్టు దగ్గర ఎంతమంది ఉండాలో, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో బందోబస్తు ఉండాలి..? అనే అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు లేఖలు పంపింది. ఈ లేఖల్లో పూర్తి అంశాలను వివరించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ హోంశాఖకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలు మోహరించనున్నాయి. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడానికి ముందే సీఐఎస్‌ఎఫ్ బలగాలను దింపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఏ ప్రాజెక్టు దగ్గర ఎంతమంది ఉండాలో, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో బందోబస్తు ఉండాలి..? అనే అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు లేఖలు పంపింది. ఈ లేఖల్లో పూర్తి అంశాలను వివరించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ హోంశాఖకు నివేదిక పంపింది. ఈ క్రమంలో గెజిట్‌కు ముందే బలగాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సైతం సమ్మతి తెలిపాయి. ఈ రెండు బోర్డులకు కేంద్ర బలగాలు రానున్నట్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతం ఒక్కో స్టేట్ రూ. 200 కోట్ల చొప్పున బోర్డులకు డిపాజిట్ చేయాల్సి ఉండగా ఏపీ ఓకే చెప్పింది. తెలంగాణ నుంచి ఇంకా రిప్లై ఇవ్వలేదు. వచ్చేనెల 14 నుంచి గెజిట్ అమల్లోకి రానున్న విషయాన్ని జల్‌శక్తి శాఖ హోంశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నది. ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకువచ్చే ప్రక్రియను సిద్ధం చేస్తున్నట్టు జలశక్తి శాఖ స్పష్టం చేసింది.
సీఐఎస్ఎఫ్కు సహకరించండి..
సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేయడంపై రెండు బోర్డులు, రాష్ట్రాల నుంచి అందించాల్సిన సహకారం, కల్పించాల్సిన వసతులు, సమకూర్చాల్సిన వాహనాలు, ఆఫీసులు, చేసుకోవాల్సిన ఒప్పందాలపై తదితర అంశాలను లేఖలో పేర్కొన్నది. జీతభత్యాలకు సంబంధించిన అంశాలన్నీ కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ అశుతోష్ కుమార్ బోర్డులకు ముసాయిదాలో వివరించారు. కృష్ణా, గోదావరి నదులు, ఉప నదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ కేంద్ర గెజిట్‌లోని మొదటి షెడ్యూల్‌లో చేర్చారని, షెడ్యూల్– 2లో పేర్కొన్న ప్రాజెక్టులు వంద శాతం బోర్డుల పరిధిలో ఉంటాయని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, చివరకు ఫర్నిచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ ఆధీనంలోనికి తీసుకుని రోజువారీ నిర్వహణ బాధ్యతలను చూస్తాయని వెల్లడించారు. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వస్తుండగా.. గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలో తెలంగాణలోని సింగూరు నుంచి ఏపీలోని ధవళేశ్వరం వరకు అన్ని ప్రాజెక్టులను గోదావరి బోర్డు తన పరిధిలోకి తీసుకుంటాయి. కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ ప్రాజెక్టులు, సిబ్బంది, కార్యాలయాల వివరాలు రాష్ట్రాల నుంచి తీసుకున్నారు.
డీఐజీ ర్యాంకు నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ల వరకు భద్రత..
ప్రాజెక్టుల భద్రత కోసం సీఐఎస్‌ఎఫ్ నుంచి డీఐజీ ర్యాంకు అధికారి మొదలు సీనియర్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పె క్టర్లతో సహా సిబ్బందిని కేటాయించనున్నట్లు ముసాయిదాలో వివరించారు. అయితే, వీరి జీతభత్యాలు, బ్యారక్‌లు, నిర్వహణ కార్యాలయాలు, వాటి నిర్వహణకు చెల్లించాల్సిన వ్యయాలపై సమగ్రంగా ముసాయిదా రూపొందించి బోర్డులకు పంపింది. ఈ ముసాయిదాపై బోర్డుల నుంచి ఆమోదం లభించింది. అయితే, ఈ ముసాయిదాను రెండు రాష్ట్రాలకు పంపించగా.. ఇంకా సమాధానం ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఏపీ నుంచి మాత్రం రూ. 200 కోట్లు డిపాజిట్ చెల్లిస్తున్నట్లు రిప్లై ఇస్తూ దాదాపు 400 మంది సిబ్బందిని కూడా కేటాయిస్తున్నట్టు తాజాగా లేఖ సమర్పించినట్టు తెలుస్తున్నది. తెలంగాణ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు.