Mohanlal: దయచేసి నన్ను క్షమించండి.. మీ ప్రేమ నమ్మకమే నా బలమంటూ మోహన్ లాల్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’(L2: Empuran).

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’(L2: Empuran). పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 27న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘L2: ఎంపురాన్’ సినిమాలో బాధపెట్టే సీన్స్ ఉన్నాయని వెంటనే బాయ్‌కాట్ చేయాలని పలువురు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. తాజాగా, ఈ వివాదంపై మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు.
‘‘ఎంపురాన్ చిత్రంలో వచ్చిన కొన్ని రాజకీయ, సామాజిక ఇతివృత్తాలు చాలా మందికి తీవ్ర మనోవేదన కలిగించాయని నాకు తెలుసు. ఒక ఆర్టిస్ట్‌గా నా సినిమాలేవి రాజకీయ ఉద్యమం భావజాలం, వర్గం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకుండా చూసుకోవడం నా కర్తవ్యం. మా సినిమా మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తున్నాం. అందుకే ఎంపురాన్ టీమ్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. మిమ్మల్ని బాధపెట్టేలా ఉన్న సీన్స్ సినిమా నుంచి తప్పనిసరిగా తొలగించాలని నిర్ణయించుకున్నాం. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకరిగా నా సినీ జీవితాన్ని గడిపాను. మీ ప్రేమ, విశ్వాసమే నా బలం. అంతకు మించిన మోహన్‌లాల్ మరేది లేదని నా నమ్మకం. ఇట్లు ప్రేమతో మీ మోహన్‌లాల్’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.
