అల్లు-మెగా ఫ్యామిలీ మళ్లీ చిచ్చు.. అగ్గి రాజేసిన జగన్ బర్త్ డే ఫ్లెక్సీ
అల్లు-మెగా ఫ్యామిలీ దగ్గర అవుతున్న క్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే ఫ్లెక్సీ మళ్లీ చిచ్చుపెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్ : అల్లు-మెగా ఫ్యామిలీ దగ్గర అవుతున్న క్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే ఫ్లెక్సీ మళ్లీ చిచ్చుపెట్టింది. అంతే కాదు.. మరోక్షంగా ఓ బలవైన కొటేషన్ పెట్టి రెండు కుటుంబాల మధ్య భారీగా దూరం పెంచేలా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ కోల్డ్ వార్ అల్లు అర్జున్ అరెస్ట్‌లో సర్దుమణుగుతున్న తరుణంలో మళ్లీ వైసీపీ శ్రేణులు పెద్దది చేసినట్టు అయింది.
నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూడా అభిమానులు ఫ్లెక్సీలు కట్టించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ ఫ్లెక్సీలో జగన్‌కు ధీటుగా అల్లు అర్జున్ ఫొటో వేశారు. అంతేనా.. ‘‘రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అంతా ఏకం అవుతారు’’ అంటూ భారీ కొటేషన్ పెట్టారు. ఇది కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పెట్టారా.. లేక మెగా ఫ్యామిలీ, జన సైనికులను ఉద్దేశించి పెట్టారా అనే చర్చకు దారి తీసింది.
జగన్‌ను ఎదురించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటైందని ఓ అర్థం వస్తుండగా.. బన్నీని ఎదుర్కొవడానికి మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఒక్కటయ్యారనే మరో అర్థం వస్తుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబానికి అండగా నిలిచింది. చిరంజీవి షూటింగ్ సైతం ఆపేసి హూటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ప్రయత్నించినా శాంతి భద్రతల దృష్ట్యా రావద్దని పోలీసులు ముందే సమాచారం ఇచ్చారు. నాగబాబు సైతం బన్నీ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చే వరకు సమీక్షించారు. ఇలా రెండు కుటుంబాలు దగ్గర అవుతున్న క్రమంలోనే తాజాగా వైసీపీ కేడర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మళ్లీ ఆ ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టినట్టు అయింది. మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.