మా వాళ్లే బై.. కాంట్రాక్టులు ఇప్పించిన మంత్రులు.. రచ్చకెక్కిన విభేదాలు

దిశ, తెలంగాణ బ్యూరో : చెక్ డ్యాం పనుల్లో అధికారులు బొక్కబోర్లా పడ్డారు. అమాత్యుల కోసం ఆగమాగంగా.. హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించే మంత్రులే ఈ చెక్​డ్యాంను పంచుకోవడం, పనులు చేపించడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఏం చేయలేక చేతులెత్తేశారు. ప్రస్తుతం చిన్న వర్షాలకే ఇటీవల నిర్మించిన చెక్​డ్యాంలు కొట్టుకుపోవడంతో ఇరిగేషన్ శాఖలో చిచ్చు మొదలైంది. గతేడాది నీటిపారుదల శాఖను మొత్తం ఒకే గొడుగు కిందకు తీసుకురాగా.. ఇప్పుడు ఇంజినీర్లు వర్గాల వారీగా విమర్శలకు […]

Update: 2021-09-13 21:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : చెక్ డ్యాం పనుల్లో అధికారులు బొక్కబోర్లా పడ్డారు. అమాత్యుల కోసం ఆగమాగంగా.. హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించే మంత్రులే ఈ చెక్​డ్యాంను పంచుకోవడం, పనులు చేపించడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఏం చేయలేక చేతులెత్తేశారు. ప్రస్తుతం చిన్న వర్షాలకే ఇటీవల నిర్మించిన చెక్​డ్యాంలు కొట్టుకుపోవడంతో ఇరిగేషన్ శాఖలో చిచ్చు మొదలైంది. గతేడాది నీటిపారుదల శాఖను మొత్తం ఒకే గొడుగు కిందకు తీసుకురాగా.. ఇప్పుడు ఇంజినీర్లు వర్గాల వారీగా విమర్శలకు దిగుతున్నారు. తప్పు మీదంటే మీదేనంటూ ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

ఇంత నిర్లక్ష్యమా..?

చెక్​డ్యాంల నిర్మాణాల్లో చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని.. పరిశీలించి డిజైన్​ చేయాల్సిన ఇంజినీర్లు తొందరపడ్డారు. కొన్ని ప్రాంతాలను ఎంచుకుని అక్కడ నిర్మాణాలకు దిగారు. దీంతో ముందస్తు పరిశీలన లేకుండా పోయింది. మొత్తం డిజైన్లలో లోపాలు స్పష్టంగా బయటకు వచ్చాయి. ఒక చెక్​డ్యాంకు డిజైన్​చేసే సమయంలో ఆ ప్రాంతంలో ముందుగా వరద నీటిని అంచనా వేయాల్సి ఉంది. దాదాపు 30 నుంచి 40 ఏండ్లలో అతి ఎక్కువగా వచ్చిన వరద ఎన్ని క్యూసెక్కులు, నీటి ఉధృతి వేగం ఎంత ఉంటుంది, ఇక ముందు ఎన్ని క్యూసెక్కులు వస్తుందనే అంశాలను సమగ్రంగా అంచనా వేయాలి.

దీన్ని అంచనా వేస్తూ ఈ చెక్​డ్యాంలు ఎంత మేరకు నిర్మాణాలు తట్టుకుంటాయనే వివరాలను సేకరించాల్సి ఉంటుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. అదే విధంగా ఎగువ ప్రాంతాల్లో ఉన్న డ్యాంలకు దిగువన చెక్ డ్యాంలను కట్టినట్టయితే గేట్లకు ఎంత దూరంలో చెక్ డ్యాంలు నిర్మించాలి, ఇప్పటి వరకు డ్యాంల నుండి నీటిని దిగువకు వదిలినప్పుడు వేగం ఎంత..?, ఎన్ని క్యూసెక్కుల నీటిని వదిలారో స్పష్టంగా డిజైన్లలో తీసుకోవాల్సి ఉండగా.. వాటిని పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. సంబంధిత డ్యాంలకు ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద నీరు, క్యాచ్‌మెంట్ ఏరియాల నుండి వచ్చే వరద నీటిని అంచనా వేయాల్సి ఉంటుందంటున్నారు.

మరోవైపు గత రెండేళ్లుగా కాళేశ్వరం జలాలను ప్రాజెక్టుల్లోకి తరలించిన నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వచ్చినట్టయితే దిగువకు వదిలినప్పుడు చెక్ డ్యాంలు తట్టుకునేందుకు అంచనాలు పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా వర్షాల సమయంలో ప్రాజెక్టుల నుంచి వదిలిన నీరు, క్యాచ్‌మెంట్​ఏరియా నుంచి వచ్చే వరదను కలుపుకుని ఉధృతిని నిర్ధారించుకోవాల్సి ఉండగా.. దీనికి సంబంధించిన అంశాలేమీ పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి.

అవసరం లేకున్నా..!

చాలా ప్రాంతాల్లో అవసరం లేకున్నా చెక్​డ్యాంలను ప్రతిపాదించినట్లు సంబంధిత శాఖ ఇంజినీర్లే ఆరోపిస్తున్నారు. ఉదాహరణగా మంథని మండలం సోమనపల్లి బ్రిడ్జీకి దిగువన అన్నారం బ్యాక్ వాటర్ సమీపంలో చెక్​డ్యాం నిర్మించారని, దీనికి ఒకవైపు నుంచి గోదావరి బ్యాక్ వాటర్, ఎగువ నుంచి మానేరు వాటర్, మరోపక్క నుంచి అన్నారం బ్యాక్ వాటర్​వస్తుందని చెప్పుతున్నారు. వాస్తవానికి అక్కడ చెక్ డ్యాం.. అసలు పాయింట్ కాదని, ఫ్లడ్ వచ్చిందంటే రెండు వైపుల నుంచి ఒత్తిడి వస్తుందంటున్నారు. ముందుగా పలువురు ఇంజినీర్లు మల్లారం, తాడిచెర్ల ఏరియాలో నిర్మిస్తే లాభం ఉండేదని సూచించినా.. సోమనపల్లి బ్రిడ్జీ దిగువనే ప్రతిపాదించి నిర్మించారంటున్నారు.

అదే విధంగా ఇటీవల ఎల్ఎండీ సస్పెన్షన్​ బ్రిడ్జీ దిగువ చెక్​డ్యాం తెగిపోయింది. ఇది కూడా అసలు పాయింట్​కాదనే విమర్శలున్నాయి. ఎందుకంటే ఎల్ఎండీ సస్పెన్షన్ బ్రిడ్జీ నుంచి కేవలం కిలోమీటరన్నర లోపల ఉంటుందని, వరద వచ్చినప్పుడు ఈ బ్రిడ్జీ గేట్లు ఎత్తితే వాటర్ స్పీడ్‌కు తట్టుకునే అవకాశమే లేదంటున్నారు. అయినప్పటికీ చిన్న వరదకే ఈ చెక్​డ్యాం తెగిపోయింది. వాస్తవానికి ఎల్ఎండీ దిగువన నైజాం కాలంలో కట్టిన ఓ బ్రిడ్జీ, 1994లో నిర్మించిన చెక్​డ్యాం మాత్రం కట్టుదిట్టంగా ఉన్నాయి. కానీ, ఇటీవల నిర్మించిన ఈ చెక్​డ్యాం మాత్రం తెగిపోయింది. దీనికితోడుగా గ్రావిటీ వరద ఉధృతిని అంచనా వేయడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి.

హడావుడితోనే ఆగమాగం..

రాష్ట్రంలో చాలాచోట్ల వేల కోట్లతో చెక్​డ్యాంల నిర్మాణాలు చేపట్టారు. వీటికి మంత్రులు, వారి బంధువుల కన్‌స్ట్రక్షన్​కంపెనీలే టెండర్లు వేశాయి. వీరికి అప్పగించడంలో కూడా మంత్రులు కీలకంగా వ్యవహరించారు. వాటిని త్వరగా నిర్మించి బిల్లులు ఇప్పించారు. దీంతో చెక్​డ్యాంలు నాసిరకంగా నిర్మాణం చేసినట్లు రూఢీ అవుతోంది.

కాగా ఇప్పుడు చెక్​డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో.. ఇరిగేషన్​శాఖలో విభేదాలు బయటకు వస్తున్నాయి. ఇంజినీర్లు తప్పు మీదంటే మీదంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనిపై కరీంనగర్​ జిల్లాకు చెందిన ఇంజినీర్లు ఏకంగా ఫిర్యాదుల వరకూ వెళ్లినట్లు అధికారుల్లో ప్రచారం జరుగుతోంది. వరద ఎక్కువగా వచ్చిందని ఒకవర్గం ఇంజినీర్లు చెప్పుతుంటే.. వరదను అంచనా వేయకుండా ఎలా నిర్మాణాలు చేశారంటూ మరోవర్గం ఆరోపిస్తోంది. మొత్తంగా ఈ చెక్​డ్యాంల నిర్మాణాల్లో డొల్లతనం ఇటు మంత్రులను, అటు అధికారులను ఇరకాటంలో పడేసింది.

Tags:    

Similar News