గొర్రెల గోల.. 10 గొర్రెలను మింగేస్తున్న దళారులు

దిశ, తెలంగాణ బ్యూరో : రెండో విడుత గొర్రెల పంపిణీలో గందరగోళం నెలకొంది. గొర్రెల పంపిణీ పథకం ప్రకారం 21 గొర్రెలు అందించాల్సి ఉండగా లబ్ధిదారులకు 11 గొర్రెలు మాత్రమే అందుతున్నాయి. ధరలు పెరిగాయన్న సాకుతో కొందరు బ్రోకర్లు గొర్రెల కాపర్లను దబాయించి తక్కువ గొర్రెలను కట్టబెడుతున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతుందని గొర్రెల కాపర్లు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ జిల్లాలకు తొలి ప్రాధాన్యం ఈ ఏడాది జనవరి 16న నల్గొండ జిల్లాలో పశుసంర్థకశాఖ మంత్రి తలసాని […]

Update: 2021-04-05 13:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రెండో విడుత గొర్రెల పంపిణీలో గందరగోళం నెలకొంది. గొర్రెల పంపిణీ పథకం ప్రకారం 21 గొర్రెలు అందించాల్సి ఉండగా లబ్ధిదారులకు 11 గొర్రెలు మాత్రమే అందుతున్నాయి. ధరలు పెరిగాయన్న సాకుతో కొందరు బ్రోకర్లు గొర్రెల కాపర్లను దబాయించి తక్కువ గొర్రెలను కట్టబెడుతున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతుందని గొర్రెల కాపర్లు ఆందోళనలు చేపడుతున్నారు.

ఈ జిల్లాలకు తొలి ప్రాధాన్యం

ఈ ఏడాది జనవరి 16న నల్గొండ జిల్లాలో పశుసంర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండో విడుత గొర్రెల పంపిణీని ప్రారంభించారు. గత నెల రోజుల నుంచి జగిత్యాల, సిద్దిపేట, జనగాం, వరంగల్ అర్బన్, భువనగిరి, మెదక్ జిల్లాలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. తొలి ప్రాధాన్యతగా డీడీలు చెల్లించి పెండింగ్ లో ఉన్న వారికి ప్రభుత్వం గొర్రెలను అందిస్తుంది. అయితే రెండవ విడుత గొర్రెల పంపిణీలో తక్కువ గొర్రెలు పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. గొర్రెల పంపిణీలో అధికారులతో పాటు బ్రోకర్లు చొరబడి గొర్రెల కాపర్లను మోసం చేస్తున్నారు.

8,109 గొర్రెల పెంపకం దారుల సొసైటీలు

రాష్ట్రంలో 8,109 గొర్రెల పెంపకం దారుల సొసైటీలు ఉండగా, వీటిలో 7,61,895 మంది సభ్యులున్నారు. వీరందరికీ గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.10 వేల కోట్లతో పథకాన్ని రూపొందించింది. రెండు విడతలలో గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించి 2017లో మొదటి విడతలో రూ.4,584 కోట్లను ఖర్చు చేసి 17 లక్షల 2 వేల 737 గొర్రెలను, 3 లక్షల 66 వేల 797 మంది లబ్ధిదారులకు అందజేశారు. డీడీలు చెల్లించి పెండింగ్ లో ఉన్న 28,335 మందికి రూ.360 కోట్లు కేటాయించి జనవరి 16నుంచి నల్లగొండ జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండవ విడుతలో ప్రభుత్వం 3 లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేపట్టేందుకు బడ్జెట్లో రూ.3000 కోట్లను కేటాయించారు.

గొర్రెల పంపిణీలో బ్రోకర్ల చేతివాటం

రెండవ విడుత గొర్రెల పంపిణీలో బ్రోకర్లు అధికారులతో కలిసి తమ చేతివాటం చూపిస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకం ప్రకారం ఒక పొట్టేలును, 20 గొర్రెలను మొత్తం 21 అందించాల్సి ఉండగా కేవలం 11 గొర్రెల మాత్రమే అందిస్తున్నారు. జనగాం జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం నడిమిగొండలో చేపడుతున్న పంపిణీలో గొర్రెల కాపర్లు తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేపట్టారు. మొత్తం 21 గొర్రెలు ఇచ్చేవరకు ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ధరలు పెరగడంతో ప్రభుత్వం అందించే నిధులకు 21 గొర్రెలు ఇవ్వడం సాధ్యంకాదని కొందరు బ్రోకర్లు లబ్ధిదారులను దబాయిస్తున్నారు. రెండో విడుత పంపిణీ జరుతున్న అన్ని జిల్లాలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. అధికారికంగా 21 గొర్రెలు అందించామని రికార్డ్ ల్లో నమోదు చేస్తున్న అధికారులు.. బ్రోకర్లతో చేతులు కలిపి 11 నుంచి 15 గొర్రెలను మాత్రమే అందిస్తున్నారు.

పెరిగిన గొర్రెల ధరలు

కరోనా నేపథ్యంలో మాంసం వినియోగం బాగా పెరిగి గొర్రెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యాదవ, గొల్ల, కురుమల కోసం 2017 జూలై 23న గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఒక పొట్టేలు, 20 గొర్రెలతో ఉండే ఒక యూనిట్‌ ధర అప్పట్లో రూ.1.11 లక్షలుగా ఖరారు చేశారు. ఈ మొత్తంలో 25 శాతం అంటే రూ.31,250లను లబ్ధిదారులు డీడీల రూపంలో చెల్లిస్తే మిగిలిన 75 శాతాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తోంది. అయితే ప్రస్తుతం యూనిట్‌ ధర రూ.2.50 లక్షలకు చేరింది. పెరిగిన ధరలను సాకుగా చూపించి లబ్ధిదారులకు బ్రోకర్లు తక్కువ గొర్రెలను అంటగడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే లబ్ధిదారులకు మేలు జరుగుతుంది.

లబ్ధిదారులకు నగదు చెల్లించాలి

గొర్రెల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. గొర్రెల పంపిణీకి బదులు యూనిట్ కి అయ్యే ఖర్చును లబ్ధిదారుల అకౌంట్ లో నగదు జమ చేస్తే గొర్రెల కాపర్లకు సౌకర్యంగా ఉంటుంది. బ్రోకర్ల ప్రమేయం లేకుండా లబ్ధిదారులు తమకు నచ్చిన చోట అధికారుల పర్యవేక్షణలో గొర్రెలను కొనుగోళు చేసి ఉపాధి పొందేందుకు అవకాశాలున్నాయి.
– ఉడుత రవీందర్, గొర్రెల పెంపకందారుల రాష్ట్ర అధ్యక్షుడు

Tags:    

Similar News