భగ్గుమంటున్న బోథ్.. గులాబీ నేతల మధ్య వర్గపోరు

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో కారు స్టీరింగ్ అదుపు తప్పుతోంది. స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గోడం నగేశ్ మధ్య వర్గపోరు జోరందుకుంది.. ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవటం, క్యాడర్‌ను పట్టించుకోకపోవటంతో ఆ పార్టీకి పట్టు తప్పుతోంది.. ఇప్పటికే బలమైన వర్గం ఉన్న మాజీ ఎంపీ నగేశ్ మరింత పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు పట్టు కోల్పోగా.. తాజాగా కొద్దిపాటి […]

Update: 2021-06-26 04:41 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో కారు స్టీరింగ్ అదుపు తప్పుతోంది. స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గోడం నగేశ్ మధ్య వర్గపోరు జోరందుకుంది.. ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవటం, క్యాడర్‌ను పట్టించుకోకపోవటంతో ఆ పార్టీకి పట్టు తప్పుతోంది.. ఇప్పటికే బలమైన వర్గం ఉన్న మాజీ ఎంపీ నగేశ్ మరింత పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు పట్టు కోల్పోగా.. తాజాగా కొద్దిపాటి ప్రజాప్రతినిధులతోనూ సమన్వయం లేకుండా పోయింది. మరోవైపు టీఎస్ డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డితో పొసగకపోవటంతో.. ఎమ్మెల్యేకు మరింత గడ్డు పరిస్థితి మొదలైందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది..!

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నియోజకవర్గంలో ఉండకపోవటం, క్యాడరును పట్టించుకోకపోవటం, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వైఫల్యం చెందారనే చర్చ నడుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో స్థానికేతరుడైనా.. రాథోడ్ బాపురావుకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నియోజక వర్గ ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించగా.. రెండోసారి 2018లోనూ విజయం అందించారు. ఆయన గత కొంతకాలంగా నియోజకవర్గం నాయకులు, క్యాడరును పట్టించుకోకపోవటం, సమన్వయం లేకపోవటంతో రోజురోజుకూ దూరం పెరుగుతోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ఆయన వ్యవహరించిన తీరుతో పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. నియోజకవర్గంలో తొమ్మిది మండలాలు ఉండగా.. నాలుగు మండలాల్లోనే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు దక్కాయి. అందులో సగానికిపైగా నాయకులు మాజీ ఎంపీ నగేశ్ వర్గానికి చెందినవారే ఉన్నారు. తాజాగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోనూ ఆయనకు సరైన సంబంధాలు, సమన్వయం లేకుండా పోయింది.

రాథోడ్ బాపురావు స్థానికంగా ఉండకపోగా.. ఆదిలాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వారానికి ఒకటి, రెండుసార్లు సెగ్మెంటుకు వస్తున్నారు. అదీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం ఇవ్వటం లేదనే విమర్శలున్నాయి. సర్కారు పథకాల చెక్కుల పంపిణీకి వచ్చి పోతున్నారని.. పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం లేదని క్యాడరులో చర్చ సాగుతోంది. కార్యకర్తలు ఆపదలో ఉన్నా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. గతంలోనే ఆయన తీరుపై కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరుకు ఫిర్యాదు చేయటంతో.. ఆ విషయం కాస్తా ఆయనకు చేరింది. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మరింత దూరం పెరిగింది. మండలానికి ఒకరిద్దరికే ప్రాధాన్యత ఇవ్వటంతో మిగతా నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరికే ప్రాధాన్యత ఇవ్వటం, కొత్త వారిని పార్టీలోకి చేర్పించి బలోపేతం చేయటంలో సఫలీకృతం కాలేకపోతున్నారనే చర్చ క్యాడరులో ఉంది.

బోథ్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ గోడం నగేశ్.. ఇక్కడి నుంచి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఆయన 2014లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలువగా.. 2019లో పరాజయం చెందారు. ఆయనకు బోథ్ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉండగా.. మొదటి నుంచి పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. తాజాగా మరింత పట్టు పెంచుకునేందుకు మాజీ ఎంపీ నగేశ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగేందుకు ఇప్పటి నుంచే పట్టు కోసం పావులు కదుపుతున్నారు. దీంతో గులాబీ పార్టీలో ఆధిపత్యం పోరు తారాస్థాయికి చేరింది. టీఎస్ డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డిది కూడా ఇదే నియోజకవర్గం కాగా.. ఎమ్మెల్యే బాపురావుకు ఆయనతో కూడా సత్సంబంధాలు లేవు. దీంతో డీడీసీ ఛైర్మన్, మాజీ ఎంపీ ఒక్కటవగా.. ఎమ్మెల్యేకు మరింత గడ్డు పరిస్థితి తప్పేలా లేదు. సొంత పార్టీలోనే ముగ్గురు నాయకులు.. రెండు గ్రూపులతో బోథ్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News