జగన్ పథకం విని నేనే ఆశ్చర్యపోయాను: చంద్రబాబు

జగనన్న వసతి దీవెన పథకం విని నేనే ఆశ్చర్యపోయానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రజా చైతన్య యాత్ర నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తానే జగనన్న వసతి దీవెన పథకం గురించి విని ఆశ్చర్యపోయానని అన్నారు. వాస్తవానికి అది వసతి దీవెన కాదని, వంచన దీవెన అని అన్నారు. గతంలో కాస్మటిక్స్, స్కాలర్‌షిప్ పేరిట అందించే మొత్తాన్ని ఇప్పుడు జగనన్న వసతి […]

Update: 2020-02-26 01:28 GMT

జగనన్న వసతి దీవెన పథకం విని నేనే ఆశ్చర్యపోయానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రజా చైతన్య యాత్ర నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తానే జగనన్న వసతి దీవెన పథకం గురించి విని ఆశ్చర్యపోయానని అన్నారు. వాస్తవానికి అది వసతి దీవెన కాదని, వంచన దీవెన అని అన్నారు. గతంలో కాస్మటిక్స్, స్కాలర్‌షిప్ పేరిట అందించే మొత్తాన్ని ఇప్పుడు జగనన్న వసతి దీవెన పేరిట అందిస్తున్నారని ఆయన తెలిపారు.

ట్రంప్‌తో విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించి, జగన్‌ను పిలవకపోవడానికి కారణం అతను ఆర్థిక నేరగాడు కావడమేనని బాబు చెప్పారు. అమెరికా చట్టాలు చాలా కచ్చితంగా ఉంటాయని, ఆర్థిక నేరగాళ్లను కలవడానికి కూడా అంగీకరించవని బాబు అన్నారు. అందుకే జగన్‌ను ఆహ్వానించలేదని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు హింసను ప్రోత్సహిస్తున్నారని, ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న ఆయన, రేపు ఇదే పరిస్థితి మీకు కూడా ఎదురవుతుందన్నది గుర్తుంచుకోవాలని సూచించారు.

అమలులో ఉన్న పథకాలు రద్దు చేస్తూ జగన్ రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నాడని ఆయన మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి పెట్టిన పథకాలను తాను కూడా కొనసాగించానని ఆయన గుర్తు చేశారు. జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు కొనసాగించానని అన్నారు. ప్రభుత్వ విధానాలు విమర్శించే మీడియాను ఎల్లో మీడియా అంటున్నారని, వ్యతిరేక కథనాలు రాసే మీడియా సంస్థలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట పేదల నుంచి అసైన్డ్ భూమిని లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. చేతనైతే భూములు కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నగదుతో లేదా దానిని పంచుతూ కనబడితే వారిని అనర్హులను చేస్తామని అంటున్నారన్న బాబు, దెయ్యాలు వేదాలు వళ్లించడమంటే ఇదేనని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను గతంలోలా 59.85 శాతం రిజర్వేషన్‌తో నిర్వహించాలని, అలా నిర్వహిస్తే తాము కూడా మద్దతిస్తామని ఆయన చెప్పారు.

Tags:    

Similar News