తెలంగాణకే నిధులెక్కువ.. టెస్టులు తక్కువ

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నతీరుపై హైకోర్టు మొదలు సామాన్యుడి వరకు తీవ్ర స్థాయిలోనే విమర్శలు వస్తున్నాయి. టెస్టులు తక్కువ సంఖ్యలో చేస్తున్నారనేది ప్రధానమైన విమర్శ. కేంద్రం సాయం చేస్తున్నా రాష్ట్రం మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతల విమర్శ. కేంద్రం నుంచి వచ్చిన సాయంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లేదా మంత్రులు ఇప్పటివరకు అధికారికంగా గణాంకాలు చెప్పలేదు. బీజేపీ నేతలు మాత్రం రకరకాల గణాంకాలను చెప్తున్నారు. ఇంతకూ […]

Update: 2020-08-16 21:01 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నతీరుపై హైకోర్టు మొదలు సామాన్యుడి వరకు తీవ్ర స్థాయిలోనే విమర్శలు వస్తున్నాయి. టెస్టులు తక్కువ సంఖ్యలో చేస్తున్నారనేది ప్రధానమైన విమర్శ. కేంద్రం సాయం చేస్తున్నా రాష్ట్రం మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతల విమర్శ. కేంద్రం నుంచి వచ్చిన సాయంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లేదా మంత్రులు ఇప్పటివరకు అధికారికంగా గణాంకాలు చెప్పలేదు. బీజేపీ నేతలు మాత్రం రకరకాల గణాంకాలను చెప్తున్నారు. ఇంతకూ కేంద్రం నుంచి ఎంత వచ్చిందనే లెక్క తేలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన దానికంటే తెలంగాణకే ఎక్కువ ఇచ్చినట్లు స్పష్టమైంది. సమాచార హక్కు చట్టం కింద జలగం సుధీర్ దాఖలు చేసిన దరఖాస్తుకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ తరపున వచ్చిన సమాధానంలో రూ.215.22 కోట్లు ఇప్పటివరకు కరోనా అవసరాలకు తెలంగాణకు ఇచ్చినట్లు స్పష్టమైంది.

జాతీయ హెల్త్ మిషన్ పథకం కింద ఇచ్చే నిధులను ఈసారి కరోనా కట్టడి కోసం ఇస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఆ సమాధానంలో పేర్కొంది. 2019-20 సంవత్సరానికి ఇవ్వాల్సిన బకాయిల్లో రూ.33.40 కోట్లను మార్చి నెలలో విడుదల చేశామని, 2020-21 సంవత్సరానికి సంబంధించినదాంట్లో రూ.181.82 కోట్లను ఏప్రిల్ నెలలో విడుదల చేసినట్లు పేర్కొంది. దేశం మొత్తం మీద 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్చి నెలలో రూ.1,113.21 కోట్లను, ఏప్రిల్ నెలలో రూ.3,000 కోట్లను విడుదల చేసినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు మార్చి నెలలో రూ.37.11 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.141.60 కోట్ల చొప్పున మొత్తం రూ.178.57 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మాత్రమే తెలంగాణ కంటే ఎక్కువ మొత్తంలో కరోనా సాయం అందింది.

జూలై నెలాఖరు నాటికే రాష్ట్రానికి 1400 వెంటిలేటర్లు, 10.09 లక్షల ఎన్-95 మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 42.50 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఇటీవల తెలియజేయగా ఇప్పుడు రూ.215.22 కోట్ల మేర నగదు సాయాన్ని కూడా చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూ.100 కోట్లను కరోనా అవసరాల కోసం రాష్ట్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖకు విడుదల చేయగా, మరో రూ.100 కోట్లను కూడా విడుదల చేయనున్నట్లు క్యాబినెట్ సమావేశం సందర్భంగా ఈ నెల మొదటివారంలో పేర్కొన్నారు.

కరోనా సాయం కోసం కేంద్రం నుంచి ఎంత డబ్బు వచ్చిందనే దానిపై బీజేపీ రాష్ట్ర నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఒక రకంగా ఉంటుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్దిష్టంగా ఎంత వచ్చిందనే విషయాన్ని వెల్లడించడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆర్టీఐ సమాధానం ద్వారా రాష్ట్రానికి ఎంత ఇచ్చిందీ వెల్లడైంది. కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ కంటే ఎక్కువగా పొందాయి. ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన రాష్ట్రాలన్నీతెలంగాణ కంటే తక్కువే పొందాయి. తక్కువ నిధులు పొందినప్పటికీ ఆ రాష్ట్రాలు చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం తెలంగాణ కంటే ఎక్కువే ఉంటున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ.125 కోట్లు మాత్రమే ఇచ్చినా కరోనా పరీక్షల్లో తెలంగాణ కంటే ఎక్కువే చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హర్యానా, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా తక్కువ నిధులు పొందినప్పటికీ కరోనా పరీక్షలు మాత్రం ఎక్కువే నిర్వహించాయి.

Tags:    

Similar News