తెలంగాణకు షాక్ ఇచ్చిన కేంద్రం.. గెజిట్ జారీ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నిర్లక్ష్యాన్ని కేంద్రం అవకాశంగా తీసుకుంది. శ్రీశైలం విద్యుత్ ​ఉత్పత్తిని ఆపడం లేదనే కారణంతోనే అత్యవసరంగా గెజిట్​ జారీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్​ సాక్షిగా దీనిపై వివరణ ఇచ్చింది. బోర్డులు చెప్పితే వినడం లేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. బోర్డు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదంటూ చెప్పకనే చెప్పింది. దీంతో కృష్ణా జలాలపై తెలంగాణ దూకుడుతోనే కేంద్రం గెజిట్​ జారీ చేసిందని తేటతెల్లమవుతోంది. సమయం […]

Update: 2021-08-09 21:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నిర్లక్ష్యాన్ని కేంద్రం అవకాశంగా తీసుకుంది. శ్రీశైలం విద్యుత్ ​ఉత్పత్తిని ఆపడం లేదనే కారణంతోనే అత్యవసరంగా గెజిట్​ జారీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్​ సాక్షిగా దీనిపై వివరణ ఇచ్చింది. బోర్డులు చెప్పితే వినడం లేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. బోర్డు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదంటూ చెప్పకనే చెప్పింది. దీంతో కృష్ణా జలాలపై తెలంగాణ దూకుడుతోనే కేంద్రం గెజిట్​ జారీ చేసిందని తేటతెల్లమవుతోంది.

సమయం కోసం వెయిటింగ్

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని కేంద్రం అడ్వాంటేజ్‌గా తీసుకుంది. ముందు నుంచీ ఏపీకి మద్దతుగా ఉంటున్నట్లే చేస్తోంది. ఇటు తెలంగాణను టార్గెట్​ చేసినట్లుగా మారుతోంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మరింతగా జోక్యం చేసుకునేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. తెలుగు రాష్ట్రాలు పరస్పరం నదీ యాజమాన్య బోర్డులకు చేసిన ఫిర్యాదుల వివరాలను తీసుకున్న కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం వాటికి ఇచ్చిన సమాధానాలను సైతం తీసుకుంది. అయితే బోర్డులు రాసిన లేఖలకు చాలా సందర్భాల్లో ప్రభుత్వం రిప్లై ఇవ్వలేదు. ప్రధానంగా రెండు రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న దాదాపు పదిహేను ప్రాజెక్టుల వివరాలను నదీ బోర్డులు కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. గతంలో తమ మధ్య సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, కేంద్రం జోక్యం అవసరం లేదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొప్పగా చెప్పారు. కానీ తాజాగా పెరిగిన వివాదాలకు కేంద్రం ఆజ్యం పోస్తూనే మధ్యవర్తిత్వం చేస్తామన్న తీరుతో ప్రవర్తించింది. మరోవైపు రెండు రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లను ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో పాటుగా బోర్డులు పలుమార్లు లేఖలు పంపాయి. కానీ బోర్డులను రెండు రాష్ట్రాలు పరిగణలోకి తీసుకోలేదు. డీపీఆర్​లు ఇవ్వలేదు.

పిటిషన్​ ఉపసంహరించుకోవడంలో సక్సెస్

గత ఏడాది అక్టోబర్​లో నిర్వహించిన అపెక్స్​ కౌన్సిల్​లో తెలంగాణను ప్లాన్​ ప్రకారం ఇరికించినట్లుగా భావిస్తున్నారు. వాస్తవంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదు. వాటిని అలా ఉంచి కొత్త పేచీ పెట్టడానికి మోడీ సర్కారు రెడీ అయినట్లు స్పష్టమవుతోంది. దానికి తెలంగాణ రాష్ట్రం తొందరపడి తలూపిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీని తీర్చటానికి ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించటానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అపెక్స్​లో పెట్టిన ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. ఈ గొడవకు సంబంధించి తెలంగాణ సర్కారు గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని ఉపసంహరించుకోవాలని సూచించారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని తొలగించటంలో ఆటంకంగా మారిందన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాన్ని దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ సుప్రీంలో పిటిషన్​ను ఉపసంహరించుకున్నారు. కానీ ఇది కేంద్రానికి మంచి అవకాశంగా చిక్కింది.

మౌనంతోనే సమాధానం

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల జల జగడం రగులుతుండడంతో కేంద్రం రంగంలోకి దిగీ దిగనట్లే వ్యవహరిస్తోంది. సుప్రీంలో తెలంగాణ పిటిషన్​ను ఉపసంహరించుకుని కేంద్రానికి సమాచారమిచ్చారు. అయితే అప్పటి నుంచి ఈ వివాదాలు మరింత పెరిగాయి. కానీ కేంద్రం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మౌనం పాటించింది. కనీసం రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు కూడా చేయడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ఇంకా పెరుగాలనే ఉద్దేశంతో చూస్తున్నట్లుగా కేంద్ర వ్యవహారించింది. కానీ రెండు రాష్ట్రాలు పట్టుమీదున్నట్టు కనిపించిన సమయంలో కేంద్రం అదును చూసి దెబ్బ కొట్టింది. మౌనంగా ఉంటూ ధీటైన సమాధానమిచ్చింది. ఇదే సమయంలో కృష్ణా బోర్డు కూడా కేంద్రాన్ని వివరణ కోరింది. జల వివాదాలు పెరుగుతుండటం, ఏపీ, తెలంగాణ లేఖలు రాయడం, విద్యుత్​ జల ఉత్పత్తి చేస్తుండటం వంటి అంశాలన్ని సూచిస్తూ లేఖ పంపింది. ఇప్పుడు కృష్ణా బోర్డు చేయాల్సిందేమిటో చెప్పాలంటూ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో కృష్ణా బోర్డు ప్రభుత్వానికి రాసిన లేఖలు.. ప్రభుత్వం నుంచి అడపాదడపా ఇచ్చిన సమాధానాలను కేంద్రానికి ఇచ్చింది.

చెప్పినా వినరా..?

కేంద్రం అదును చూసి వాత పెట్టింది. అంతా అనుకున్నట్లే జరిగింది. ఇన్నాళ్లూ కాచుక్కూర్చున్న సమయం రాగానే గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది. జల వివాదాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జుట్టు మోదీ చేతిలో పెట్టినట్లయింది. అసలే దక్షిణాదిన బలహీనంగా ఉన్న బీజేపీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్న కమలనాధులకు ఈ పంచాయతీ కలసి వచ్చేట్లే కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల తగువును నానుస్తూ తమకు అనుకూలంగా మార్చుకుంటూనే ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకువస్తూ గెజిట్​ ఇచ్చింది. జల వివాదాలు, కేంద్రం గెజిట్​పై పార్లమెంట్​లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్​ ఉత్పత్తిని కొనసాగించడంపై బోర్డు పదే పదే లేఖలు రాసిందని కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని పార్లమెంట్​లో వెల్లడించారు. కృష్ణాలో వరద తక్కువగా ఉన్నప్పుడే శ్రీశైలం విద్యుత్​ ఉత్పత్తిని ప్రారంభించడంతో జూన్​ 17న కృష్ణాబోర్డు లేఖ రాసిందని, ముందుగా లేఖను తెలంగాణ జెన్​కోకు పంపినట్లు వెల్లడించారు. దానికి నెల రోజుల తర్వాత జూలై 17న తెలంగాణ జెన్​కో సమాధానమిచ్చిందని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తామని బోర్డుకు తెలిపిందన్నారు. ఆ తర్వాత కృష్ణా బోర్డు మళ్లీ తెలంగాణకు లేఖ రాసిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గత నెల 15న గెజిట్​ విడుదల చేసిందంటూ కారణాలను విశ్లేషించింది. బోర్డులు చెప్పినా నిర్లక్ష్యంగా ఉండటంతోనే బోర్డుల పరిధిని ఖరారు చేసేందుకు గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసినట్లు వెల్లడించింది.

Tags:    

Similar News