రాష్ట్రవ్యాప్తంగా నిఘా నేత్రం

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా మరింత కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థకు సర్కారు శ్రీకారం చుడుతోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను పోలీసు శాఖ ఇన్‌స్టాల్ చేయనుంది. దీనికి ఆధునిక టెక్నాలజీని కూడా జోడించనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఉన్న కెమెరా వ్యవస్థను ఇకపైన దశలవారీగా జిల్లాల్లోనూ నెలకొల్పనుంది. నేరాల దర్యాప్తులో మాత్రమేగాక నివారణలోనూ సీసీటీవీ కెమెరా ఫుటేజీని విస్తృతంగా వినియోగించుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ప్రస్తుతానికి ఆరు పోలీసు కమిషనరేట్ల పరిధిలో, 20 జిల్లాల్లో కెమెరాలను బిగించాలనుకుంటోంది. […]

Update: 2020-10-27 03:26 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా మరింత కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థకు సర్కారు శ్రీకారం చుడుతోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను పోలీసు శాఖ ఇన్‌స్టాల్ చేయనుంది. దీనికి ఆధునిక టెక్నాలజీని కూడా జోడించనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఉన్న కెమెరా వ్యవస్థను ఇకపైన దశలవారీగా జిల్లాల్లోనూ నెలకొల్పనుంది. నేరాల దర్యాప్తులో మాత్రమేగాక నివారణలోనూ సీసీటీవీ కెమెరా ఫుటేజీని విస్తృతంగా వినియోగించుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ప్రస్తుతానికి ఆరు పోలీసు కమిషనరేట్ల పరిధిలో, 20 జిల్లాల్లో కెమెరాలను బిగించాలనుకుంటోంది. రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి మళ్లీ ప్రారంభం కావడంతో సీసీటీవీలను సమీప భవిష్యత్తులో గ్రామాల్లో కూడా నెలకొల్పాలని భావిస్తోంది. నవంబరు చివరికల్లా అన్నింటినీ సమకూర్చుకుని సంక్రాంతి పండుగకల్లా మొత్తం వ్యవస్థ వినియోగంలోకి వచ్చేలా ప్రణాళికను రూపొందించుకుంది.

బుల్లెట్, డోమ్ కెమెరాలతో..

నిజామాబాద్, రామగుండం, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతోపాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ‌పేట్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో కెమెరాలను పోలీసు శాఖ ఏర్పాటు చేస్తోంది. ఒక్కో జిల్లాలో (కమిషనరేట్లలో కూడా) 24 చొప్పున స్టేషనరీ బుల్లెట్ కెమెరాలను అమర్చనున్నారు. జిల్లాకు ఐదు చొప్పున డోమ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటికి 64 జీబీ సామర్థ్యం కలిగిన 624 మెమొరీ కార్డులను అమర్చనున్నారు. వీడియో ఫుటేజ్ ఎప్పటికప్పుడు సర్వర్‌లో రికార్డు చేయడానికి 6 టీబీ, 4 టీబీ సామర్థ్యం కలిగిన హార్డ్ డిస్కులను సమకూర్చుకుంటున్నారు. కరెంటు లేకున్నా రెండు గంటల పాటు కెమెరాలు పనిచేసేలా ఒక కేవీ సామర్థ్యంతో 350 యూపీఎస్‌లను కూడా సిద్ధం చేయనున్నారు.

14 వారాల్లో అమల్లోకి వచ్చేలా..

సీసీ కెమెరాలను ట్యాంపరింగ్ చేయడానికి వీలు లేకుండా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ట్యాంపరింగ్‌కు ప్రయత్నిస్తే ఆటోమేటిక్‌గా అలారం మోగేలా ప్రత్యేక వ్యవస్థను టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురికాకుండా లైటెనింగ్ అరెస్టు పరికరాలను కూడా అమరుస్తున్నారు. మొబైల్ ఫోన్లు, టాబ్‌ల ద్వారా కూడా ఈ కెమెరాలను వీక్షించేలా ప్రత్యేక ఐపీ అడ్రస్ వ్యవస్థతో అనుసంధానం చేస్తున్నారు. ఈ కెమెరాలు ఎక్కడెక్కడ అమర్చాలో తొలుత సర్వే చేసి ఆ ప్రకారం స్థానిక పోలీసు అధికారులతో చర్చించిన తర్వాత ఫైనల్ చేయాలని ఆలోచిస్తున్నారు. కెమెరాలను ఇన్‌స్టాల్ చేసే బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని, ఇందుకోసం టెండర్ల ద్వారా సంస్థను ఖరారు చేయాలని భావిస్తున్నారు.

టెండర్ దక్కించుకున్న సంస్థకే సర్వే బాధ్యతలు అప్పజెప్పి నివేదిక ఇచ్చిన తర్వాత పోలీసు అధికారుల చర్చల సందర్భంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో అమర్చడంపై తుది నిర్ణయం జరగనుంది. టెండర్ ఖరారైన తర్వాత ఆ సంస్థ 14 వారాల్లో కెమెరాలను బిగించడం, సర్వర్‌కు అనుసంధానం చేయడం, ట్రయల్ రన్ పూర్తి చేసి స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్‌కు అప్పగించేలా డీజీపీ కార్యాలయం ఆలోచిస్తోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణ బాధ్యతలను ఐదేండ్ల పాటు ఆ సంస్థకే అప్పగించాలనుకుంటోంది. ఈ కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానంలో ఉంటాయి. దీంతో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలన్నీనిఘా వ్యవస్థకు కిందకు రానున్నాయి.

Tags:    

Similar News