ఆరేండ్ల నుంచి సీసీఎల్ఏ పోస్ట్ ఖాళీ
దిశ, న్యూస్ బ్యూరో: అందరూ తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను బద్నాం చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.. సామాన్యుడు న్యాయం పొందలేక పోతున్నాడు. డబ్బు, పలుకుబడి, రాజకీయ నాయకులు, రియల్టర్లకే పనులు చకచకా సాగుతున్నాయి. ప్రతి పనికీ పైసా వసూలు తప్పనిసరి అయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఆర్ఏ మొదలు ఉన్నతాధికారుల వరకు భూ వ్యవహారాల్లో అంతులేని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వ్యవసాయం, పురపాలక, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, ఆర్అండ్‌బీ.. ఇలా దాదాపు అన్ని శాఖలకు కమిషనర్లు ఉన్నారు. కానీ […]
దిశ, న్యూస్ బ్యూరో: అందరూ తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను బద్నాం చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.. సామాన్యుడు న్యాయం పొందలేక పోతున్నాడు. డబ్బు, పలుకుబడి, రాజకీయ నాయకులు, రియల్టర్లకే పనులు చకచకా సాగుతున్నాయి. ప్రతి పనికీ పైసా వసూలు తప్పనిసరి అయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఆర్ఏ మొదలు ఉన్నతాధికారుల వరకు భూ వ్యవహారాల్లో అంతులేని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వ్యవసాయం, పురపాలక, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, ఆర్అండ్‌బీ.. ఇలా దాదాపు అన్ని శాఖలకు కమిషనర్లు ఉన్నారు. కానీ రాష్ట్రంలో భూ పరిపాలనకు ప్రధాన కమిషనర్ పోస్టు కొన్నేండ్లుగా ఖాళీగా ఎందుకు ఉంచారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకే ఒక్కరు రేమాండ్ పీటర్ మాత్రమే సీసీఎల్ఏ పోస్టులో కూర్చున్నారు. అది కూడా ఏడు నెలలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు తర్వాత అత్యంత కీలకమైనది సీసీఎల్ఏ మాత్రమే. ప్రభుత్వంలోనే రెండో ప్రాధాన్య బాధ్యతలను అప్పగించేందుకు ఐఏఎస్ అధికారులే లేరా? అన్న సందేహం కలుగుతోంది. ఆరేండ్ల కాలంగా ఖాళీగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్న రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భూ పరిపాలనను చూసే అధికారి లేకుండా రెవెన్యూ వ్యవస్థ గాడిన పడే అవకాశం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. చాలా కాలంగా ఉద్దేశపూర్వకంగానే అదనపు బాధ్యతలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీసీఎల్ఏ బాధ్యతలన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, భూ సంబంధ అంశాలు అనేకం పెండింగులో ఉన్నాయి. దానికితోడు రెండేండ్లుగా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. మీడియా కూడా రెవెన్యూ చట్టాలు వచ్చేస్తున్నాయంటూ కొత్త కథలు అల్లుతూనే ఉంది. వారికి సీఎంవో నుంచి అందించిన సమాచారం అంటూ ఏయే అంశాలను పొందుపరిచారో కథనాలు ప్రచురిస్తున్నాయి. పూర్తి స్థాయి సీసీఎల్ఏ లేకుండానే ఏకపక్షంగా సాగే రెవెన్యూ చట్టానికి పరిపూర్ణత లభిస్తుందా? అంటూ రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సీనియారిటీ, అనుభవం కలిగిన జయేష్ రంజన్, అర్వింద్ కుమార్, అజయ్ మిశ్రా, రజత్ కుమార్, డి.రోనాల్డ్ రాస్, సునీల్ శర్మ, రజత్ కుమార్, చిత్రారామచంద్రన్ వంటి ఎంతో మంది ఉన్నారు. వాళ్లందరూ సీసీఎల్ఏ పోస్టు నిర్వర్తించగలిగే సత్తా ఉన్నది. కానీ వారెవరినీ నియమించకుండా ఏండ్లుగా చీఫ్ సెక్రెటరీ చేతిలోనే ఉంచడం విడ్డూరంగా ఉంది. కొత్త రెవెన్యూ చట్టంలో సీసీఎల్ఏ పోస్టు ఉంటుందా? ఉండదా? ఏ లక్ష్యంతో ఈ పోస్టుకు ఎవరిని నియమించడం లేదని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎస్ దగ్గరికి వెళ్లడం సాధ్యమేనా?
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ చేతిలో అనేక కీలకాంశాలు ఉంటాయి. ఎన్నో అంశాల్లో నిర్ణయాత్మక శక్తి ఉంటుంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు (అదనపు కలెక్టర్లు)లతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయిస్తారు. భూ సంబంధ విధానాలు, భూ కేటాయింపులు, భూ సేకరణ, వేలం పాటల ద్వారా అమ్మకాలు, సర్వే ల్యాండ్ సెటిల్మెంట్, కొత్త పాసు పుస్తకాల జారీ వంటి అనేక అంశాలు సీసీఎల్ఏనే చూస్తారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు వంటి వాటిపై సర్వాధికారాలు సీసీఎల్ఏకే ఉన్నాయి. ఇప్పుడు ఏ రోజు ఏ కొత్త మండలం, కొత్త డివిజన్ ఏర్పడుతుందో అంతుచిక్కదు. సీఎం ఎక్కడైనా సభ నిర్వహించారంటే హామీ ఇచ్చేస్తారు. వారం రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ క్షేత్ర స్థాయి పరిశీలన చేయడానికి, ఫైళ్లు సిద్ధం చేసేందుకు సీసీఎల్ఏ ఎక్కడ ఉన్నారు? కానీ రేమాండ్ పీటర్ పని చేసిన కాలంలో ప్రతి బుధవారం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే వారు. ఏ జిల్లాలో ఎన్నేసి కేసులు, వివాదాలు ఉన్నాయో తెలుసుకునేవారు. పరీక్షించేందుకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.
పట్టాదారు పాసు పుస్తకాల జారీ కూడా పెండింగులో ఉండకుండా అప్రమత్తం చేశారు. ఆయన బదిలీ తర్వాత ఏ ఒక్కరూ సమీక్ష నిర్వహించలేదు. కేవలం ప్రగతి భవన్‌కు ఆహ్వానించినప్పుడు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశాన్ని విని రావడానికి పరిమితమైంది. అయితే ప్రత్యేకంగా రెవెన్యూ, భూముల సంబంధ అంశాలపైనే అందరు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమీక్షించిన సందర్భాలు చాలా తక్కువ. వారానికో సారి పర్యవేక్షణకు, ఏడాదికోసారి సమావేశాలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో అంచనా వేయొచ్చునని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఏదైనా వివాదంలో నిర్ణయాన్ని తీసుకోవాలంటే సీసీఎల్ఏకు చెప్పాలి. ప్రతి పనికి ఇప్పుడు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్‌ను దర్శించుకోవడం ఎంత మంది అధికారులకు సాధ్యమవుతుందని ప్రశ్నించారు. లెక్కలేనన్ని బాధ్యతల్లో మునిగే సీఎస్‌తో గంటల తరబడి భూ సంబంధ అంశాలను ఎలా వివరించడమని ఓ డిప్యూటీ కలెక్టర్ అన్నారు.
పాసు పుస్తకాల జారీలో జాప్యం
కొత్త పాసు పుస్తకాల వ్యవస్థ చాలా పటిష్టమైనదని, ఇలా రిజిస్ట్రేషన్.. అలా పాసు పుస్తకం అంటూ సీఎం కేసీఆర్ అన్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడేమో ప్రతి జిల్లాలోనూ నెలలు గడిచినా కొత్త పాసు పుస్తకాలు జారీ కావడం లేదు. ఎవరైనా భూములను విక్రయిస్తే వాళ్ల పాసు పుస్తకాల్లో నుంచి ఆ భూముల వివరాలను తొలగించే వ్యవస్థే లేదు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం వేలాది ఎకరాలు సేకరించారు. చాలా మందికి అవార్డు పాస్ చేశారు. కానీ ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో వాళ్ల పేర్లే వస్తున్నాయి. పాసు పుస్తకాల్లోనూ యథాతథంగా కొనసాగుతున్నాయి. రైతుబంధు పథకం కింద డబ్బులు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకొందరికి నష్టపరిహారం అందించకుండా కాలయాపన చేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నఉదంతాలు అనేకం ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన తర్వాతే అనేక భూ సంబంధ వివాదాలు వెలుగులోకి వచ్చాయి. పార్టు బి అంటూ నేటికీ పెండింగులో ఉంచడం వల్ల వేలాది మంది రైతులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వీటన్నింటినీ పరిశీలించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ అధికారులు లేరు.
క్రమశిక్షణా చర్యలేవి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో భూ సంబంధ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఎంతో మంది లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కానీ వీటికి బాధ్యులెవరో, వారిపై ఏవిధమైన క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోలేదు? మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోనే వందల ఎకరాల విస్తీర్ణాలకు హక్కులు కల్పించారంటూ పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. వాటికి కారకులైన అధికారులపై ఇప్పటికీ ఏ చర్యా తీసుకోలేదు. కోర్టుల్లో నలుగుతోన్న కేసుల్లో కౌంటర్లు దాఖలు చేసేందుకు చర్చలెక్కడా జరగడం లేదు. జాయింట్ కలెక్టర్ల వ్యవస్థ రద్దు తర్వాత అదనపు కలెక్టర్లను నియమించారు. వాళ్లలో సగం మంది స్థానిక సంస్థలు, సగం మందికి మిగతా బాధ్యతలు అంటూ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు భూ సంబంధ అంశాల పరిశీలన, కేసుల విచారణ మొదలే కాలేదు. ఎవరికి వారు తమకెందుకు అంటూ కాలయాపన చేస్తుండడం వల్ల వేలాది కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
లేఅవుట్లకు పాసు పుస్తకాలు
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో అనేక పొరపాట్లు తలెత్తాయి. నగరాల శివార్లలో వేలాది ఎకరాల్లో వెంచర్లు వెలిశాయి. నిర్మాణాలు కూడా దర్శనమిస్తున్నాయి. కానీ పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా కొత్త పాసు పుస్తకాలను జారీ చేశారు. దాంతో సదరు భూములు తమవంటూ, ఖాళీ చేయాల్సిందేనంటూ కొత్తగా పాసు పుస్తకాలు పొందిన వాళ్లు చేస్తోన్న హడావిడి అంతా ఇంతా కాదని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ వాపోయారు. ప్రధానంగా మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అనేక ఉదంతాలు ఉన్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే చేసిన తప్పిదాల వల్ల వేలాది మంది ప్లాట్ల యజమానులు ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. ఇలాంటి అనేక కేసులను సీసీఎల్ఏ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ పోస్టులో ఎవరూ లేకపోవడం వల్ల అధికారులు కూడా వాటి పట్ల మౌనం వహించారన్నారు. రెవెన్యూ శాఖను బద్నాం చేయడంలో కీలక పాత్ర వహిస్తోన్న మేధావులకు సమస్యల పరిష్కారానికి సీసీఎల్ఏ లేరన్న అంశంపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. అత్యంత కీలకమైన పోస్టును ఇన్‌చార్జిలతోనే కాలం వెళ్లదీయడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ సాగుతోంది.