విద్యార్థులారా.. ఇక ‘ఫెయిల్’ కాలేరు

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఫెయిల్’ అనే పదం.. ఎంతోమంది విద్యార్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తుందన్నది కాదనలేని వాస్తవం. ఓ విద్యార్థి లేదా ఓ వ్యక్తి మెడలో ‘ఫెయిల్’ అనే ట్యాగ్ లైన్ వేయడం సరికాదన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. ఫెయిల్ అయినంత మాత్రాన జీవితానికొచ్చే నష్టం ఏం లేదన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. కానీ అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు.. ఫెయిలైతే జీవితంలో ఎందుకు పనికిరాడన్నట్లు, అసలు జీవితమే వ్యర్థమైనట్లు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని వాళ్లు భరించలేకపోతున్నారు. కొంతమంది […]

Update: 2020-07-14 01:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
‘ఫెయిల్’ అనే పదం.. ఎంతోమంది విద్యార్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తుందన్నది కాదనలేని వాస్తవం. ఓ విద్యార్థి లేదా ఓ వ్యక్తి మెడలో ‘ఫెయిల్’ అనే ట్యాగ్ లైన్ వేయడం సరికాదన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. ఫెయిల్ అయినంత మాత్రాన జీవితానికొచ్చే నష్టం ఏం లేదన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. కానీ అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు.. ఫెయిలైతే జీవితంలో ఎందుకు పనికిరాడన్నట్లు, అసలు జీవితమే వ్యర్థమైనట్లు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని వాళ్లు భరించలేకపోతున్నారు. కొంతమంది ‘ఆత్మహత్య’లకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. విద్యార్థులపై ఒత్తిడిని తొలగించడానికి సీబీఎస్ఈ తమ మార్కు షీట్లలో ‘ఫెయిల్, కంపార్ట్‌మెంటల్’ అనే పదాలను తొలగిస్తున్నట్లు తాజాగా వెల్లడించాయి.

ర్యాంకులు, మార్కులు, పోటీ, కెరీర్ అంటూ.. విద్యార్థులపై రోజురోజుకూ ఒత్తిడి పెంచేస్తున్నారు. ఆ ఒత్తిడి.. క్రమక్రమంగా వారిని మరింత భయంలోకి నెట్టేస్తోంది. పరీక్షలు, చదువు అంటేనే వణుకు పుట్టేలా చేస్తోంది. ఇష్టపడి చదవాల్సిన విద్యార్థి.. ఏదో కొండను మోస్తున్నట్లు, ఏదో అతీంద్రియ శక్తి తమపై కూర్చుని ఊపిరాడకుండా చేస్తున్నట్లు భారంగా, భయంగా చదువులు కొనసాగిస్తున్నారు. దీనికి తోడు పోటీతత్వం, కంపారిజన్స్ వారిని ఆత్మన్యూనతకు గురిచేస్తున్నాయి. విద్యాసంస్థలు కూడా ర్యాంకులు, పర్సెంటేజ్‌లు రాకపోతే.. జీవితమే లేదన్నట్లుగా విద్యార్థులను తయారు చేస్తున్నారు.

మార్పు :

‘ఫెయిల్’ అంటే ‘ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్’ అని ఆ పదంలోనే నిగూఢమైన అర్థం దాగుంది. ఈ మాటలకు థామస్ అల్వా ఎడిసన్ చెప్పిన సమాధానం అక్షరాల సరిపోతుంది. ‘నేను 800 సార్లు ఫెయిల్ కాలేను. బల్బు వెలగకపోవడానికి 799 కారణాలను తెలుసుకున్నా’ అని బల్బు కనిపెట్టిన సందర్భంలో ఆయన చెప్పారు. అందుకే.. ‘ఫెయిల్’ అనే పదంలో ఉన్న నెగెటివిటీని ముందుగా మార్చాలి. అసలు ‘ఫెయిల్’ అయితే.. ఏమవుతుంది? మరో ప్రయత్నానికి ముందడుగవుతుంది అంతే కదా! పరీక్షల్లో తప్పితే పోయేదేముంది.. మరోసారి రాసి పాస్ కావచ్చనే ధీమా విద్యార్థుల్లో రావాలి. అందుకు పేరెంట్స్ సపోర్ట్‌తో పాటు గురువుల ప్రోత్సాహం కూడా ఉండాలి. ‘గెలుపుదేముందిరా.. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. అదే ఓడిపోయి చూడు.. ఈ ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయమవుతుంది’ అని ఓ రచయిత అన్నట్లు నిజమే కదా. ‘ఫెయిల్’ అనే పదాన్ని మరో కోణంలో చూడగలిగితే, అప్పుడు ఏ విద్యార్థి కూడా ఫెయిల్ అయినా, మార్కులు తెచ్చుకోకపోయినా బాధపడడు.. సెలబ్రేట్ చేసుకుంటాడు. ఎందుకంటే.. ఈ సారి మరింతగా ఆ సబ్జెక్ట్‌ను అర్థం చేసుకోవడానికి మరో అవకాశం వచ్చినందుకు.

వాటి స్థానంలో :

సీబీఎస్ఈ ఫలితాలు ఇటీవలే వచ్చాయి. అయితే, ఈ ఫలితాలతో పాటు విద్యార్థులకు ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ మరో తీపి కబురు కూడా తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో ‘నెగెటివిటీ’ ‘ప్రెషర్’ పెంచుతున్న ‘ఫెయిల్’ అనే పదాన్ని మార్క్ షీట్ల నుంచి తొలగిస్తూ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ‘ఫెయిల్’‌కు బదులుగా ‘ఎసెన్షియల్ రిపీట్’ అనే పదాన్ని రిపోర్ట్ కార్డులో చేర్చనుంది. ఇందుకోసం ప్రిన్సిపాల్స్, రీజనల్ ఆఫీసర్స్, ఎడ్యుకేషనలిస్ట్స్ నుంచి ‘ఫెయిల్’ ‘కంపార్ట్‌మెంటల్’ అనే పదాలకు ఆల్టర్నేట్ వర్డ్స్ సూచించాల్సిందిగా ఫిబ్రవరిలో కోరింది. ఫిబ్రవరి నుంచి దీనిపై కసరత్తులు చేసి, చివరకు ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ఫెయిల్’ అనే పదం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని, వారి భవిష్యత్‌ను కూడా ఎఫెక్ట్ చేస్తుందని అందుకోసం వీటిని మార్చామని అధికారులు స్పష్టం చేశారు. ఇది వరకు ఓ విద్యార్థి రెండు సబ్జెక్టుల్లో 33 శాతం కంటే తక్కువ మార్కులు తెచ్చుకుంటే.. ‘కంపార్ట్‌మెంటల్’ అని, అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో 33 % కంటే తక్కువొస్తే.. ‘ఫెయిల్’ అనే రాసేవారు.

పరుగు పందెంలో.. ఓ వ్యక్తి కేవలం సెకను వ్యవధిలో విజేతగా నిలుస్తాడు. అయితే, రెండో వ్యక్తి ఫెయిల్ అయినట్టేనా? కాదు కదా! అక్కడ ఇద్దరూ తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ విజేత మాత్రం ఇంకొంచెం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టడంతో గెలిచాడు. అంతే.. మరోసారి రేసులో చివరగా వచ్చిన వ్యక్తి కూడా ఎఫర్ట్ పెడితే అందరికన్నా ముందుంటాడు. ఎక్కడైనా ఇదే సూత్రం.. ఓడిపోయిన ప్రతీసారి లోపాలను సరిదిద్దుకుంటూ, మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్లడమే. ఓటమి అంటే.. ఒకర్ని ఓడించడమో లేదా మనం ఓడిపోవడమో కాదు. మన లోపాలను తెలుసుకోవడం.

Tags:    

Similar News