పెంపుడు పిల్లుల ఆహారం కోసం.. కోర్టులో పిటిషిన్ వేసిన యజమాని
దిశ వెబ్ డెస్క్ : లాక్ డౌన్ కారణంగా మనుషులకే కాదు మూగ జీవాలకు తిండి దొరకడం లేదు. వీధుల్లో సంచరించే మూగ జీవాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో తన పెంపుడు జంతువు కోసం కేరళకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి ఏకంగా పోలీసులపైనే కోర్టులో పిటీషన్ వేశాడు. తన పిల్లులకు ఆహారం తీసుకు రావడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంటూ.. అతను కోర్టు మెట్లు ఎక్కాడు. మన దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా […]
దిశ వెబ్ డెస్క్ : లాక్ డౌన్ కారణంగా మనుషులకే కాదు మూగ జీవాలకు తిండి దొరకడం లేదు. వీధుల్లో సంచరించే మూగ జీవాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో తన పెంపుడు జంతువు కోసం కేరళకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి ఏకంగా పోలీసులపైనే కోర్టులో పిటీషన్ వేశాడు. తన పిల్లులకు ఆహారం తీసుకు రావడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంటూ.. అతను కోర్టు మెట్లు ఎక్కాడు.
మన దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. ఆదివారం ఒక్కరోజే 11 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో కేరళలో కరోనా కేసులు సంఖ్య 306 కు చేరుకుంది. ఇప్పటికే కరోనా కారణంగా కేరళలో ఇద్దరు చనిపోయారు. కేరళలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పౌరులెవరైనా.. నిత్యావసరాలు కొనుగోలు చేయాలంటే.. ముందుగా ఆన్ లైన్ లో పోలీసులు అనుమతి తీసుకోవాలి. చెప్పిన రీజన్ వాస్తవమైతేనే.. సదరు వ్యక్తికి పోలీసులు డిజిటల్ పాస్ అందిస్తారు. అయితే.. కేరళకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు. లాక్ డౌన్ వల్ల పిల్లులకు పెట్టే ఆహారం అంతా అయిపోయింది. దాంతో వాటికి ఆహారం తీసుకు రావడానికి ‘కొచ్చిన్ పెట్ ఆసుపత్రి’ వెళ్లాలనుకున్నాడు. అందుకోసం ఆన్ లైన్ లో వెహికల్ పాస్ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరాడు. అందుకు వారు అంగీకరించలేదు. దాంతో ప్రకాశ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేరళ హైకోర్టులో పిటీషన్ వేశాడు.
ఆ పిటిషిన్లో :
‘నేను మూడు పిల్లలను పెంచుకుంటున్నాను. నేను శాఖాహారిని కావడంతో.. మా ఇంట్లో మాంసాహారం వండలేను. వాటికి మీయో పెర్షియన్ అనే బిస్కట్లను ఆహారంగా ఇస్తాను. 7 కేజీల బరువుండే ఒక ప్యాకెట్ వాటికి మూడు వారాలు సరిపోతుంది. ఇప్పుడు బిస్కెట్లు అయిపోవడంతో.. ఏప్రిల్ 4న ఆన్ లైన్ లో పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ, పోలీసులు మాత్రం నా దరఖాస్తును తిరస్కరించారు. వారికి నా పిల్లులు ఫోటోలు కూడా జతచేశాను. అంతేకాదు స్వయంగా రాష్ర్ట ముఖ్యమంత్రే వీధి కుక్కలకు ఆహారం పెట్టాలని చెబుతున్నాడు. కానీ పోలీసులు మాత్రం ఇలా చేయడం సరికాదు. భూమ్మీదున్న ప్రతి జంతువుకు జీవించే హక్కు ఉంది. జంతు చట్టంలోని సెక్షన్ 3 మరియు 11ల ప్రకారం.. పెంపుడు జంతువులకు ఆశ్రయం మరియు ఆహారాన్ని పొందే హక్కు ఉంది. కోర్టు దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలి’ అని పేర్కొన్నాడు. జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్, జస్టిస్ షాజి పి చాలి నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 6న వీడియో కాన్ఫరెన్స్ లో ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ పరిశీలించి, తీర్పు చెప్పనుంది.
మన దగ్గర :
కరోనా ప్రభావంతో.. దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీని కారణంగా దినసరి కూలీలు, వీధి వ్యాపారులు, భిక్షగాళ్లు, మరెంతోమంది పనులు కోల్పోయి ఆహారం కోసం అలమటిస్తున్నారు. అయితే వీరి ఆకలిని తీర్చడానికి ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. ఎంతోమంది వారికి ఆహారం అందిస్తున్నారు. మరి కొందరికీ నిత్య అవసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల కేవలం మనుషులే కాదు.. మూగ జీవాలైన వీధి కుక్కలు, పిల్లులు, ఆవులు, ఇతర జంతువులకు ఆహారం కరువైంది. ప్రజలంతా ఇల్లకే పరిమితం కావడంతో పాటు, దుకాణాలన్నీ మూసీ ఉండటం వల్ల మూగ జీవాలకు ఎక్కడా ఆహారం దొరకక విలవిల్లాడుతున్నాయి. హోటళ్లు, మాంస విక్రయ కేంద్రాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాలను అమ్మే దుకాణాలు చెత్త కుప్పల్లో వేసే ఆహారమే.. మూగ జీవాలకు ప్రధాన ఆహార వనరు. కానీ అవి కూడా లాక్ డౌన్ కారణంగా మూత పడ్డాయి. పౌరులంతా కూడా ఇల్లకే పరిమితమయ్యారు. ఈ కారణాల వల్ల అసలు వాటికి అన్నం దొరకడమే కరువైంది. ఈ పరిస్థితుల్లో వాటిని ఆదుకోవడానికి చాలా తక్కువ మంది మాత్రమే ప్రయత్నిస్తున్నారు. తన పెంపుడు పిల్లుల కోసం కేరళకు చెందిన ఓ యజమాని అంతగా తాపత్రయపడితే.. మరి వీధుల్లో సంచరించే వేలాది మూగ జీవాల పరిస్థితి ఏంటి? మూగ జీవాల ప్రాణాలు కాపాడటానికి, వాటి ఆకలిని తీర్చడానికి ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు లేకపోవడం విచారకరమని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒడిషా, బెంగళూరు ఆదర్శనీయం :
లాక్ డౌన్ కారణంగా జంతువులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఒడిషా ప్రభుత్వం ముందే గ్రహించింది. మూగ జీవాల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ.. వాటికి ఆహారం అందించడానికి చొరవ చూపింది. ఒడిషా గవర్నమెంట్ సీఏం సహాయ నిధి నుంచి రూ. 54 లక్షలు విడుదల చేసింది. వాటిని అన్ని మున్సిపాలిటీలకు సమంగా మంజూరు చేసింది. మూగ జీవాల కోసం వాటిని ఖర్చు చేయాల్సిందిగా ఆదేశించింది. బెంగళూరు నగర పాలక సంస్థ కూడా, ఎన్జీవోలతో కలిసి.. నగరంలోని మూగ జీవాలకు ఆహారం అందిస్తుంది.
Tags : lockdown, pets, cats, kerala, court, petition, petfood, street dogs, animals