12 ఏళ్ల తర్వాత మళ్లీ అరబ్‌లీగ్‌లోకి సిరియా..
అరబ్ లీగ్‌లోకి సిరియా అధికారికంగా ప్రవేశించింది. లీగ్ విదేశాంగ మంత్రులు కైరోలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. 2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆందోళనలు అణచివేయడం, అంతర్యుద్ధానికి దారి తీసింది. ఆ దేశం సభ్యత్వం కూడా రద్దయింది. సిరయాను కూటమిలోకి తీసుకోవడానికి జరిగిన సమావేశానికి ఖతార్ సహా పలు దేశాలు గైర్హాజరయ్యాయి.
బైడెన్ స్వదేశీ విధాన సలహాదారుగా నీరా టండన్ నియామకం:
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహామండలిలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు దక్కింది. బైడెన్ స్వదేశీ విధాన సలహాదారుగా 52 ఏళ్ల నీరా టండన్ నియమితులయ్యారు. స్వదేశీ విధానం, ఆర్థిక, రక్షణ విధానాల రూపకల్పనలో అధ్యక్షుడికి సాయపడే మూడు మండళ్లలో.. ఒక దానికి భారతీయ అమెరికన్ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు స్వదేశీ విధాన రూపకల్పనకు నీరాను నియమించడం కీలకం అయింది. ఆర్థికాభివృద్ధి, జాతుల మధ్య సమానత్వం, ప్రజారోగ్యం, విద్య, వలస వ్యవహారాలపై ఆమె సహకరిస్తుందని బైడెన్ ప్రకటించారు. ఇప్పటి వరకు నీరా ఒబామా, బిల్ క్లింటన్ వద్ద పనిచేశారని, తాజా నియామకంతో ముగ్గురు దేశాధ్యక్షుల వద్ద పనిచేసినట్లు అవుతుందన్నారు.
దేశంలోనే తొలిసారిగా డ్రోన్ పోలీసింగ్:
కేరళలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ నిఘా వ్యవస్థను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. ఇలా అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారి. రాష్ట్రంలోని 20 జిల్లాల పోలీసులకు ఒక్కో డ్రోన్‌ను అందించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రోన్ పైలట్లకు లైసెన్సులు అందజేశారు. దేశయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ.. పోలీసు బలగాల ఆధునికీకరణలో దేశంలోనే కేరళ ముందంజలో ఉందన్నారు. యాంటీ డ్రోన్ వ్యవస్థ 5 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఇతర డ్రోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోగలదని, ప్రత్యర్థుల డ్రోన్లను నాశనం చేయగలదని సైబర్‌డోమ్ నోడల్ అధికారి తెలిపారు.
దేశ వ్యాప్తంగా డ్రోన్లతో బ్లడ్ రవాణా: ఐసీఎంఆర్:
డ్రోన్లతో రక్తాన్ని సరఫరా చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలోనే దేశమంతటా విస్తరించనున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు.ఐడ్రోన్ కార్యక్రమం కింద ఈ మేరకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రయల్ రన్ తాజాగా విజయవంతమైందన్నారు. రక్తం, దాని సంబంధిత ఉత్పత్తులను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా డ్రోన్ ద్వారా రవాణా చేయగల సామర్థ్యాన్ని సముపార్జించుకున్నట్లు వెల్లడించారు. ఈ ట్రయల్ రన్‌లో భాగంగా గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ మధ్య ఓ డ్రోన్‌తో 10 యూనిట్ల రక్తాన్ని సరఫరా చేసి విజయవంతమయ్యారు.
ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల్లో తెలంగాణ టాప్:
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ ఫలితాలను కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భారత్ మరో మైలురాయిని దాటినట్లు పేర్కొంది. మిషన్ రెండో దశలో దాదాపు 50 శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ స్థాయికి చేరాయని, ఇందులో 100 శాతం ఫలితాలు సాధించి తెలంగాణ టాప్‌లో నిలిచినట్లు వెల్లడించింది.
బహిరంగ మల విసర్జన లేనటువంటి ఈ గ్రామాల్లో ఘన లేదా ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అమల్లో ఉంటే వాటిని ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా పిలుస్తారు. దేశ వ్యాప్తంగా 2,96,928 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్‌లో ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. ఇందులో అన్ని గ్రామ పంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్‌గా కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ (100 శాతం) తోలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు ఉండగా చివరి స్థానంలో గుజరాత్ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, దామన్ డయ్యూ, లక్షద్వీప్‌లలో 100 శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ హోదాలో ఉన్నట్లు తెలపింది.
గడిచిన 35 ఏళ్లలో 42 మందిపై పార్లమెంట్ అనర్హత వేటు:
గత 35 ఏళ్లలో వేర్వేరు కారణాల వల్ల 42 మంది పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు పడింది. వీరిలో అత్యధికంగా 19 మంది ఎంపీలు 14వ లోక్‌సభలోనే తమ పదవులు కోల్పోయారు. ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకోవడం, పార్టీ ఫిరాయింపులు దీనికి ప్రధాన కారణాలు. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లు, అంతకుమించి శిక్షపడిన ప్రజా ప్రతినిధులపై ప్రజా ప్రాతినధ్య చట్టం ప్రకారం చర్యలు ఉంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్, బీఎస్పీ నేత అఫ్జాల్ అన్సారీలు ఇదే కారణంతో తమ పదవుల్ని కోల్పోవాల్సి వచ్చింది.
తెలంగాణ సీఎం ప్రధాన సలహాదారుగా సోమేశ్‌కుమార్:
మాజీ సీఎస్, విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు క్యాబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేశారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సోమేశ్‌కుమార్ 2019 డిసెంబర్ 31 నుంచి దాదాపు మూడేళ్ల పాటు పనిచేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం సోమేశ్ కుమార్‌ను ఏపీ కి బదిలీ చేసింది. తర్వాత ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడంతో .. కేంద్రం ఆమోదించింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియామకం చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది.
భారత వృద్ధి రేటు 6 శాతం: ఫిచ్ అంచనా..
ఆర్థక వ్యవస్థ బలమైన వృద్ధికి తోడు, అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండటం వల్ల భారత్‌కు స్థిరత్వంతో కూడిన బీబీబీ - సార్వభౌమ రేటింగ్ కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ ఫిచ్ వెల్లడించింది. అయితే అధిక ద్రవ్యలోటు, రుణాల రూపంలో భారత్‌కు సవాళ్లు ఎదురుకావచ్చని వివరించింది. తక్కువ పెట్టుబడుల గ్రేడ్ అయిన బీబీబీ - రేటింగ్‌ను 2006 ఆగస్టు నుంచి భారత్‌కు ఫిచ్ కొనసాగిస్తుంది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది 6 శాతం వృద్ధిరేటును భారత్ నమోదు చేయవచ్చని పేర్కొంది. 2022-23లో 7 శాతం, 2024-25లో 6.7 శాతం వృద్ధిని ఫిచ్ అంచనా వేసింది.