ఎక్స్‌ట్రా ఫీజు చెల్లిస్తే ఫాస్ట్‌గా డెలివరీ చేయనున్న Zomato!

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఇటీవల కాలంలో కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తెస్తుంది.

Update: 2024-04-25 10:34 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఇటీవల కాలంలో కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఇప్పుడు తాజాగా మరో సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు సమాచారం. వినియోగదారులు తమ ఆర్డర్‌ను వేగంగా పొందడానికి కొంత మొత్తం ఫీజును అదనంగా చెల్లిస్తే సాధారణ సమయం కంటే ముందుగా ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి జొమాటో సిద్ధమవుతుంది. డెలివరీ సమయాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులు వేగంగా తమ ఆహారాన్ని పొందగలరని కంపెనీ భావిస్తోంది.

ఇప్పటికే ఫుడ్ డెలివరీ ఆలస్యం అవుతుందని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. కొంతమంది ఆలస్యం కారణంగా డెలివరీని క్యాన్సిల్ చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి. ఈ సమస్యను ఎదుర్కొని అగ్రస్థానంలో ఉండటానికి కంపెనీ ఫాస్ట్ డెలివరీ సదుపాయాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు చేపడుతున్నారు. జొమాటోలో ఫుడ్‌ను ఆర్డర్ పెట్టే సమయంలో ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవాలి. దీనిని బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో పరీక్షిస్తున్నారు. బెంగళూరులో సాధారణ 21 నిమిషాల డెలివరీ సమయంతో పోల్చితే, ఒక కస్టమర్ 16-21 నిమిషాల డెలివరీకి రూ. 29 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఒక నివేదిక వెల్లడించింది. జొమాటో గోల్డ్ సభ్యులు కూడా ఈ అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నివేదించబడింది. త్వరలో దీనికి సంబంధించిన అప్‌డేట్ రానుంది.


Similar News