Dmart: 8 శాతానికి పైగా పతనమైన డీమాట్ షేర్

వార్షిక పరంగా డీమార్ట్ లాభాలు 8 శాతం పెరిగినప్పటికీ, అంచనాల కంటే నిరాజనకంగానే ఉన్నాయి.

Update: 2024-10-14 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సూపర్ మార్కెట్ల రిటైల్ చెయిన్ డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ సొమవారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలను ఎదుర్కొన్నది. మార్కెట్లు ముగిసే సమయానికి సంస్థ షేర్ ధర 8.35 శాతం వరకు పతమై 4,191 వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో పాటు అనేక బ్రోకరేజ్ సంస్థలు స్టాక్ ధరను డౌన్‌గ్రేడ్ చేయడంతో షేర్ కుప్పకూలింది. వార్షిక పరంగా డీమార్ట్ లాభాలు 8 శాతం పెరిగినప్పటికీ, అంచనాల కంటే నిరాజనకంగానే ఉన్నాయి. ఎందుకంటే పన్నుల చెల్లింపు తర్వాత మునుపటి త్రైమాసికం కంటే లాభాలు 12 శాతం పడిపోయాయి. ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 14,050 కోట్లు నమోదు చేసింది. క్విక్ కామర్స్ కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా డీమార్ట్ లాభాలు తగ్గుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు మెట్రో నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న కారణంగా డీమార్ట్ బలహీనపడుతోంది. ఈ క్రమంలోనే పలు బ్రోకరేజ్ సంస్థలు డీమార్ట్ షేర్ ధరను తగ్గించాయి. స్టాక్ ధర కుదేలైన కారణంగా రాధాకిషన్ దమానీ, ఇతర ప్రమోటర్లు మొత్తంగా రూ. 20,800 కోట్ల నష్టాలను చూశారు.

Tags:    

Similar News