J&K: ఆర్టికల్ 370 రద్దుతో తొలిసారి ఓటు వేసిన శరణార్థులు

దీంతో ఈ ఎన్నికలతో ఆర్టికల్ 370 రద్దు ద్వారా లక్షలాది మంది శరణార్థులు ఓటు హక్కుతో ప్రయోజనం పొందారు.

Update: 2024-10-01 17:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరి దశ పోలింగ్‌ ముగిసింది. 90 స్థానాలకు గానూ మూడు దశల్లో సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. మంగళవారం జరిగిన తుది విడత పోలింగ్ రికార్డు స్థాయిలో 65.65 శాతం నమోదైంది. అయితే, 2019లో ఆర్టికల్‌ 370 రద్దయిన నేపథ్యంలో రాష్ట్రహోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ మారిన తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఎన్నికలతో ఆర్టికల్ 370 రద్దు ద్వారా లక్షలాది మంది శరణార్థులు ఓటు హక్కుతో ప్రయోజనం పొందారు. మంగళవారం పోలింగ్ సందర్భంగా జాతీయ మీడియా ప్రశ్నించినప్పుడు.. పంజరంలో ఉన్న పక్షిని విడిపించారని ఓ ఓటరు చెప్పారు. ఇదే తరహా స్పందన జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా వినిపించింది.

మంగళవారం జరిగిన పోలింగ్‌లో పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు(డబ్ల్యూపీఆర్), వాల్మీకీలు, గూర్ఖాలతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కమ్యూనిటీల నుంచి దాదాపు 1.5 లక్షల మంది ఓటు వేశారు.'మా కమ్యూనిటీకి గత 70 ఏళ్లుగా ఓటు వేసే హక్కు లభించలేదు. వాల్మీకి కమ్యూనిటీని ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరంగా ఉంచారని ' జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో మొదటిసారి పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థి మీడియాతో చెప్పారు. జమ్మూకశ్మీర్ పౌరులుగా, ఓటర్లుగా మారడానికి వీలు కల్పించిన ఆర్టికల్ 370ని రద్దుపై తన సంఘం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శరణార్థులకు చెందిన నేత లాభ రామ్ గాంధీ తెలిపారు.

50 ఏళ్లలో తొలిసారి ఓటు హక్కు..

ఓటుకు ఒకరోజు ముందు పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు సాంబా, జమ్మూ జిల్లాల్లోని చక్ర, చబే చక్‌ ప్రాంతాల్లో ప్రజలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. 'చాలా సంతోషంగా ఉన్నాం... తనకు 50 ఏళ్లు కానీ నేను మొదటిసారి ఓటు వేస్తున్నాను. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి' అని ఓ ఓటర్ మీడియాతో చెప్పారు. ఏడు దశాబ్దాలకు పైగా అవసరంలేని పౌరులుగా ఉన్న పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకీలు, గూర్ఖాలకు ఓటు వేయడంతో వారికి రాజకీయ ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఎట్టకేలకు చరిత్రలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్నామని, ఇది మాకు కల సాకారమైన సందర్భమని డబ్ల్యూపీఆర్ లాభ రామ్ గాంధీ అన్నారు. తాము ఇప్పుడు జమ్మూకశ్మీర్ పౌరులమని, ఓటర్లుగా మారామనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని వెళ్లడించారు.

'ఈ ఎన్నికలు మాకు చారిత్రాత్మక ఘట్టం': వాల్మీకి వర్గం

1957లో పారిశుద్ధ్య పనుల కోసం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా నుంచి వాల్మీకీలను (దళితులను) జమ్మూకశ్మీర్‌కి తీసుకువచారు. వారు కూడా తొలిసారిగా ఓటు వేశారు. గాంధీ నగర్, డోగ్రా హాల్ ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు 12,000 మంది సభ్యులకు రాష్ట్ర సబ్జెక్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎటువంటి ఓటింగ్ హక్కులు, విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు, భూమి యాజమాన్యం హక్కులు నిరాకరించబడ్డాయి. ఎన్నికల ద్వారా వారంతా ఇళ్లు, విద్య, ఉపాధి అవకాశాలు వంటి సౌకర్యాల కోసం ప్రభుత్వాన్ని అడగాలని భావిస్తున్నారు.

హక్కులు దక్కాయి.. గూర్ఖా వర్గం

ఈ ఎన్నికలతో తమకు 'అన్ని హక్కులు మంజూరు అయ్యాయీ అని గూర్ఖా కమ్యూనిటీ తెలిపింది. ఇది గూర్ఖా కమ్యూనిటీకి కూడా ఉత్తేజకరమైన అవకాశం. వారి పూర్వీకులు డోగ్రా సైన్యంలో పనిచేయడానికి దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు వచ్చారు. వారిలో చాలా కుటుంబాలు ఇప్పటికీ కనీసం ఒక యుద్ధ వీరులను కలిగి ఉన్నాయి. 'ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సాహసోపేత నిర్ణయానికి ధన్యవాదాలు. మేము ఇప్పుడు జమ్మూకశ్మీర్ పౌరులం. అన్ని హక్కులను లభించాయని ' గూర్ఖ సంఘ అధ్యక్షులు కరుణ ఛెత్రి చెప్పారు. 

Tags:    

Similar News