పేటీఎంకు ఆఫర్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్
పేటీఎం అత్యధిక లావాదేవీలు, స్థూల సరుకుల విలువలో దాదాపు 75 శాతం దాని యాప్‌లో కస్టమర్లు జరిపే లావాదేవీల నుంచే వస్తున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనుమతిస్తే పేటీఎంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాబ్ చౌదరీ ఓ ప్రకటనలో తెలిపారు. పేటీఎం అత్యధిక లావాదేవీలు, స్థూల సరుకుల విలువలో దాదాపు 75 శాతం దాని యాప్‌లో కస్టమర్లు జరిపే లావాదేవీల నుంచే వస్తున్నాయి. 'పేటీఎం కంపెనీ దేశీయ ఫిన్‌టెక్ రంగంలో కీలకమైన పోటీదారు. రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి, ఆర్‌బీఐ మమ్మల్ని అనుమతిస్తే వారితో కలిసి పనిచేస్తాం' అని ఆయన పేర్కొన్నారు. పేటీఎం బ్రాండ్‌ని నిర్వహిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ యూపీఐ యాప్ కార్యకలాపాల కోసం ప్రస్తుతానికి మరే ఇతర వాణిజ్య బ్యాంకులతో కలిసి పనిచేయడంలేదు. జనవరి 31న ఆర్‌బీఐ ప్రకటనకు ముందు నుంచే పేటీఎంతో పనిచేయడానికి చర్చలు జరుపుతున్నామని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ చౌదరీ అన్నారు. అయితే, చర్చలు సాధారణ వ్యాపారం కోసమే నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.