బడ్జెట్ ప్రకటన ఫిబ్రవరి ఆఖరు నుంచి 1వ తేదీకి ఎందుకు మారిందో తెలుసా..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ఏళ్ల నాటి సంప్రదాయాన్ని మార్చింది.
దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మరో వారం రోజులే మిగిలుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్‌ను సమర్పించేవారు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ఏళ్ల నాటి సంప్రదాయాన్ని ఫిబ్రవరి 1కి మార్చింది.
2017లో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ జైట్లీ వలసరాజ్యాల కాలంలో మాదిరిగా ఫిబ్రవరి చివరి పనిదినాన కేంద్ర బడ్జెట్‌ను సమర్పించబోమని ప్రకటించారు.
వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్. దీన్ని యూనియన్ బడ్జెట్ అని కూడా పిలుస్తారు. ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా వేసిన ఖర్చులు, ఆదాయాలను అందించే ప్రభుత్వ పత్రం. ఇది పార్లమెంటు ఆమోదం కోసం ఫిబవరి 1న ప్రవేశపెడతారు. ఈ సంప్రదాయం 1860లలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు భారత్‌లో ప్రారంభించారు.
బడ్జెట్ ప్రకటన తేదీ ఎందుకు మారింది..
బ్రిటీష్ పాలనలో వలసరాజ్యాల కాలంలో అనుసరించిన 92 ఏళ్ల పద్దతికి ముగింపు పలికేందుకు కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1కి మార్చారు. ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విధానాలు, మార్పులకు సిద్ధం అయ్యేందుకు ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం ఉంటోంది. అందుకే దీన్ని మారుస్తున్నట్టు అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు.
ఇదికాకుండా బ్రిటీష్ హయాంలో అమల్లో ఉన్న రైల్వే ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే సంప్రదాయాన్ని కూడా రద్దు చేశారు. కేంద్ర బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను సైతం కలిపి ప్రకటించడం ప్రారంభించారు.
ఇతర మార్పులు..
1999 వరకు ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేవారు. బ్రిటీష్ ఇండియా నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని స్వాతంత్ర్యం తర్వాత కూడా మార్చలేదు. వలసరాజ్యాల కాలంలో బ్రిటీష్ స్థానిక సమయం ఆధారంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఈ కాలమానం ప్రకారం, భారత్‌లో సాయంత్రం 5 గంటలకు సమానం కావడం మూలాన, అదే విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. దీనివల్ల బడ్జెట్ గణాంకాలను మరింత క్షుణ్ణంగా విశ్లేషించేందుకు తగిన సమయం, చర్చలకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో స్వాతంత్ర్య భారతంలో ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన మొదటి ఆర్థిక మంత్రిగా యశ్వంత్ సిన్హా నిలిచారు.
మధ్యంతర బడ్జెట్..
ఈ ఏడాది బడ్జెట్ ప్రకటనలో ఎలాంటి కీలక ప్రకటనలు ఉండవు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మాత్రమే వర్తించే మధ్యంతర బడ్జెట్‌ను తీసుకొస్తారు. పూర్తిస్థాయి బడ్జెట్ మాదిరిగానే మధ్యంతర బడ్జెట్ లోక్‌సభలో చర్చించి ఆమోదించబడుతుంది. అయితే, ఓట్-ఆన్-అకౌంట్ విషయంలో విస్తృతమైన చర్చ లేకుండా ఆమోదించడం జరుగుతుంది.
మధ్యంతర లేదా తాత్కాలిక బడ్జెట్‌కు పన్ను వ్యవస్థలో మార్పులను ప్రతిపాదించే అధికారం ఉన్నప్పటికీ, ఓట్-ఆన్-అకౌంట్ పన్ను విధానాన్ని సవరించలేదు. మధ్యంతర బడ్జెట్ ఏప్రిల్ నుంచి జూన్/జూలై వరకు లేదా కొత్త ప్రభుత్వం సమగ్ర బడ్జెట్ సమర్పించే వరకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి నిధులను తీసుకునేందుకు పార్లమెంటరీ ఆమోదంలా పనిచేస్తుంది.
భారత ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి భారీ పన్ను, ఆర్థిక సంబంధిత చర్యలను అమలు చేయకుండా నియంత్రణ ఉంటుంది. కాబట్టి కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు పన్ను చెల్లింపుదారులు వేచి ఉండవలసి ఉంటుంది.