కొందరికే ట్వీట్లు కనిపించేలా ట్విట్టర్ నిబంధనల్లో మార్పు!
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ నిబంధనలను ఉల్లంఘించే ట్వీట్లను ఎక్కువమందికి చేరకుండా నియంత్రించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ నిబంధనలను ఉల్లంఘించే ట్వీట్లను ఎక్కువమందికి చేరకుండా నియంత్రించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు ట్విట్టర్‌లో వాక్ స్వేచ్ఛ ఉంటుంది, అయితే అది ఎంతమందికి, ఎవరికి చేరాలి అనే అంశంపై స్వేచ్ఛ ఉండదని వెల్లడించింది.
కొత్తగా చేయబోయే మార్పులను మొదట్లో విద్వేశపూరితంగా ఉండే ట్వీట్‌లకు 'విజబిలిటీ ఫిల్టరింగ్' ఫీచర్‌తో లేబుల్ ఇవ్వనుంది. అనంతరం అన్ని అంశాలకు చెందిన వాటిని వర్తించేలా చూడనున్నట్టు ట్విట్టర్ వివరించింది. ట్విట్టర్ వినియోగదారులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని, అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉండే ట్వీట్‌లకు సంబంధించి ఇతర వినియోగదారులను రక్షించడంలో భాగంగా లేబుల్ ఇస్తామని స్పష్టం చేసింది.