Telecom Industry: ట్రాయ్ కొత్త నిబంధనలపై సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆందోళన
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం గురించి అసంతృప్తి వ్యక్తం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: స్పామ్ కాల్స్, మెసేజ్‌ల సమస్యను పరిష్కరించడానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. స్పామ్ కాల్స్ విషయంలో గణాంకాలు తప్పుగా నివేదించడం, పదే పదే నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై ట్రాయ్ భారీ జరిమానా విధించనున్నట్టు ఇటీవల ప్రకటించింది. అయితే, టెల్కోలకు అధిక పెనాల్టీపై సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం గురించి అసంతృప్తి వ్యక్తం చేసింది. టెలికాం కంపెనీలు ఇప్పటికే స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాయి. ఫలితంగా టెల్కోలకు సంబంధించి వాటి ప్రభావం తగ్గింది. కానీ ఎలాంటి నియంత్రణా లేని ఓటీటీ యాప్‌ల కారణంగా ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్ పి కొచ్చార్ చెప్పారు. ఈ విషయంలో టెలికాం కంపెనీలు మధ్యవర్తిగా మాత్రమే ఉన్నందున వాటిపై అధిక జరిమానాలు ప్రయోజనాలు అందించవు. తద్వారా అసలు సమస్యకు పరిష్కారం లభించదని సీఓఏఐ అభిప్రాయపడింది.