Fixed Deposits పై ఏ ఏ బ్యాంకులు ఎంత మొత్తం వడ్డీ ఇస్తున్నాయో తెలుసా..?
దేశవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతున్న నేపథ్యంలో గత రెండు నెలల కాలంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను పెంచింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతున్న నేపథ్యంలో గత రెండు నెలల కాలంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను పెంచింది. మొత్తం మూడు సార్లు జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. దీనివల్ల ఎఫ్‌డీల్లో మదుపు చేయాలని భావించే వినియోగదారులకు ఇది సదవకాశంగా మారింది. అధిక ద్రవ్యోల్బణ కట్టడితో పాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. రుణాల గిరాకీని దృష్టిలో ఉంచుకుని నిధులను సమీకరించేందుకు బ్యాంకులు సాధారణ ఎఫ్‌డీలతో పాటు ప్రత్యేక డిపాజిట్ పథకాలను ప్రకటిస్తూ ఖాతాదారులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన పలు బ్యాంకులు ఎంతం మొత్తం ఇస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
ఎస్‌బీఐ..
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అన్ని కాల వ్యవధులకు సంబంధించిన ఎఫ్‌డీలపై 15 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇదే సమయంలో రాబోయే పండుగ సీజన్‌తో పాటు దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగాఉత్సవ్ డిపాజిట్ పేరుతో ప్రత్యేక టర్మ్ డిపాజిట్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 1000 రోజుల కాలవ్యవధుల ఎఫ్‌డీలపై ఏడాదికి 6.10 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ పథకం తాత్కాలిక కాలానికి ఆగష్టు 15 నుంచి 75 రోజుల వరకు అందుబాటులో ఉండనుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా..
మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం ప్రత్యేక సందర్భంగా 'బరోడా తిరంగా' పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. దీన్ని రెండు కాలవ్యవధులపై అధిక వడ్డీని ఇవ్వనున్నట్టు బ్యాంకు వెల్లడించింది. ఇందులో భాగంగా 444 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 5.75 శాతం, 555 రోజుల కాలపరిమితిపై 6 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు తెలిపింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం అధిక వడ్డీ లభిస్తుంది.
కెనరా బ్యాంక్..
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సైతం వినియోగదారులకు అధిక ప్రయోజనం కల్పించేలా 666 రోజుల కాలవ్యవధి ఉండే ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అలాగే, సాధారణ ఎఫ్‌డీల్లో 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధి ఉండే వాటిపై వడ్డీ రేట్లను 2.90 శాతం నుంచి 5.75 శాతం మధ్య ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ ప్రకటించింది.
పీఎన్‌బీ..
ప్రముఖ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రత్యేక 1,111 రోజుల కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధికంగా 5.75 శాతం వడ్డీని ఇస్తోంది. ఇది కాకుండా సాధారణ ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలవ్యవధి ఎఫ్‌డీలపై 3 శాతం నుంచి 5.65 శాతం మధ్య వడ్డీ అమలు చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం అధిక వడ్డీని అమలు చేస్తోంది. అలాగే, బ్యాంకు కొత్తగా రెండు కాలవ్యవధులతో కూడిన ఎఫ్‌డీలను ప్రారంభించింది. ఇందులో రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం జమ చేసే వారికి 405 రోజులకు 6.10 శాతం, 406 రోజుల కాలపరిమితితో రెండేళ్ల డిపాజిట్లకు 5.50 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇవి రెండు ఆగష్టు 19 నుంచి అమల్లోకి వచ్చాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారంలోనే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. వివిధ కాలపరిమితులను బట్టి రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధి మధ్య 2.75 శాతం నుంచి 4.50 శాతం మధ్య వడ్డీ అందిస్తోంది. 555 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 5.55 శాతం వడ్డీ ఇస్తోంది.
ఇండియన్ బ్యాంక్..
మరో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 పదేళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 2.80 శాతం నుంచి 5.60 శాతం మధ్య వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం అధిక వడ్డీ అందజేస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..
ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు సంబంధించి ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వివిధ కాలపరిమితులను బట్టి 2.75 శాతం నుంచి 5.75 శాతం మధ్య వడ్డీ రేట్లను ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం అధిక వడ్డీని ఇస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్..
మరో దిగ్గజ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ ఏడు రోజుల నుంచి పదేళ్ల వివిధ కాలపరిమితులను బట్టి ఎఫ్‌డీలపై 3.25 శాతం నుంచి 5.75 శాతం మధ్య వడ్డీలను ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ అమలవుతుంది.
యాక్సిస్ బ్యాంక్..
అతిపెద్ద ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ సైతం వివిధ కాలపరిమితులను బట్టి ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల కాలానికి 2.5 శాతం నుంచి 5.75 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సీటిజన్లకు 17-18 నెలల కాలానికి డిపాజిట్లపై అత్యధికంగా 6.80 శాతం వడ్డీ ఇస్తోంది. వివిధ కాలపరిమితులకు వేర్వేరు వడ్డీ వడ్డీ రేట్లు అమలవుతాయి.
కరూర్ వైశ్యా బ్యాంక్..
ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ రూ. 2-5 కోట్ల మధ్య డిపాజిట్లకు 7 రోజుల నుంచి 5 పదేళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 3.75 శాతం నుంచి 6.25 శాతం మధ్య వడ్డీని ఇస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్
ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంకు సైతం వివిధ కాలవ్యవధులను బట్టి ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల ఎఫ్‌డీలపై 2.50-5.90 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీని అమలు చేస్తోంది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్..
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వివిధ కాలవ్యవధులను బట్టి ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల కాల ఎఫ్‌డీలపై 3.50 శాతం నుంచి 6 శాతం మధ్య వడ్డీని ఇస్తోంది. అత్యధికంగా ఐదేళ్ల కాలవ్యవధిపై 6.50 శాతం వడ్డీ అమలు చేస్తోంది.
ఎస్ బ్యాంక్..
ఎస్ బ్యాంకు ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై 3.25 శాతం నుంచి 6.75 శాతం మధ్య వడ్డీని అమలు చేస్తోంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాం సైతం తాజాగా 525 రోజుల నుంచి 990 రోజులు, అలాగే 75 నెలల కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై కాలవ్యవధులపై అధికంగా 7.50 శాతం వడ్డీ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
Phone Pay, Google Pay వాడుతున్నారా.. RBI షాకింగ్ డెసిషన్
అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్న పోస్టాఫీసు SCSS స్కీం