CII: 2030 నాటికి భారత్-ఆఫ్రికా వాణిజ్యం రెట్టింపు
భారత్-ఆఫ్రికా వాణిజ్యాన్ని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-ఆఫ్రికా వాణిజ్యాన్ని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు న్యూఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన ఇండియా ఆఫ్రికా బిజినెస్ సమావేశంలో భారత ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. ఆటోమొబైల్స్, వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, లాజిస్టిక్స్ రంగాల్లో ఆఫ్రికా-భారతదేశం మధ్య వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సాధికారత, సామర్థ్యం పెంపుదల, సహకారంపై చర్చలు జరుపుతున్నట్లు వారు చెప్పారు.
ఇదే కార్యక్రమంలో వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ మాట్లాడుతూ, ప్రస్తుత వృద్ధి, సానుకూల అంశాలను బట్టి, 2030 నాటికి రెండు ప్రాంతాల మధ్య 200 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశం-ఆఫ్రికా వాణిజ్యం 2022-23లో $100 బిలియన్లుగా నమోదైంది. ఆఫ్రికా ప్రాంతంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కొన్ని ఆర్థిక సెజ్‌లను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ రంగంలో ఇరు ప్రాంతాలు మరింత సహకరించాలని బార్త్వాల్ పిలుపునిచ్చారు. భారత్ ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆఫ్రికన్ దేశాలకు ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చిందని ఆయన అన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దమ్ము రవి మాట్లాడుతూ, ఆఫ్రికా-భారతదేశం మధ్య వాణిజ్యం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ రెండు ప్రాంతాలు కొన్ని విషయాల్లో ఆర్థిక ఏకీకరణ సాధించాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించి ఎజెండా 2063 ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు..