స్పామ్ కాల్స్‌కు చెక్.. కాలర్ ఐడీని ప్రారంభించిన టెలికాం కంపెనీలు
దేశీయ టెలికాం కంపెనీలు కాలర్ ఐడీ సర్వీస్ ట్రయల్స్‌ను ప్రారంభించాయి. ముందుగా ముంబై, హర్యానాలో ఈ ప్రక్రియను మొదలుపెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం కంపెనీలు కాలర్ ఐడీ సర్వీస్ ట్రయల్స్‌ను ప్రారంభించాయి. ముందుగా ముంబై, హర్యానాలో ఈ ప్రక్రియను మొదలుపెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల కాలంలో మొబైల్ వినియోగదారులకు స్పామ్ కాల్స్, మోసపూరిత కాల్స్ ఎక్కువగా పెరిగాయి. దీనికి పరిష్కారంగా కాలర్ ఐడీని తెస్తున్నారు. దీని ద్వారా ఏదైనా ఫోన్ నంబర్ నుంచి ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి పేరు డిస్‌ప్లే పైన ముందుగా కనబడుతుంది, దీంతో సదరు యూజర్‌కు కాల్ చేస్తున్నది ఎవరో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ సదుపాయం కోసం వినియోగదారులు ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు.
అయితే అధికారికంగా టెలికాం కంపెనీలు ఈ ఆప్షన్‌ను అందించాలని ప్రభుత్వం కోరినప్పటికి ఆయా కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని నేరుగా అందించడానికి టెలికాం కంపెనీలు దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. మొదటగా రెండు నగరాల్లో ప్రారంభించిన ట్రయల్స్‌ను రాబోయే రోజుల్లో విడతల వారీగా ఇతర నగరాలకు కూడా విస్తరిస్తామని కంపెనీల అధికారులు మీడియా ప్రతినిధులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఒక టెలికాం కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ, CNAP (కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్) తీసుకురావడానికి పరిమిత సంఖ్యలో ట్రయల్స్ ప్రారంభించాం. ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇన్‌కమింగ్ నెంబర్ మాత్రమే కాకుండా ఆ కాలర్ పేరు కూడా డిస్‌ప్లే పైన కనబడుతుంది. దీనికి సంబంధించిన ట్రయల్స్ ఫలితాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT)తో పంచుకుంటామని అన్నారు.