రూ.9400 కోట్ల విలువైన టీసీఎస్ షేర్లను విక్రయించనున్న టాటా సన్స్
టీసీఎస్ మొత్తం షేర్లలో 0.65 శాతానికి సమానమైన 2.34 కోట్ల షేర్లను కంపెనీ విక్రయించనుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో మాతృసంస్థ టాటా సన్స్ సుమారు రూ. 9,367 కోట్ల విలువైన షేర్లను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. రాయిటర్స్ నివేదిక ప్రకారం, టీసీఎస్ మొత్తం షేర్లలో 0.65 శాతానికి సమానమైన 2.34 కోట్ల షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, డిసెంబర్ 31 నాటికి టాటా సన్స్‌కు టీసీస్‌లో 72.4 శాతం వాటా ఉంది. తాజా విక్రయంలో భాగంగా కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 4,001కి అమ్మనుంది. ఇది సోమవారం ట్రేడయిన ధర రూ. 4,144.25 కంటే 3.5 శాతం తక్కువ కావడం గమనార్హం. జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్ ప్రతిపాదిత వాటా విక్రయానికి జాయింట్ బుక్‌రన్నర్‌లుగా వ్యవహరించనున్నాయి. ప్రస్తుతం టీసీఎస్ షేర్ ధర 1.78 శాతం క్షీణించి రూ.4144.75 వద్ద ముగిసింది.