దేశంలోనే మొదటి వెహికల్ స్క్రాపింగ్ యూనిట్‌ను ప్రారంభించిన టాటా మోటార్స్!

దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారత్‌లో మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ప్లాంటును మంగళవారం ప్రారంభించింది.

Update: 2023-02-28 10:54 GMT

జైపూర్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారత్‌లో మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ప్లాంటును మంగళవారం ప్రారంభించింది. రీసైకిల్ విత్ రెస్పెక్ట్ పేరుతో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ యూనిట్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ ప్లాంటు ఏడాదికి 15,000 వాహనాలను స్క్రాప్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని టాటా మోటార్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న గంగానగర్ వాహన్ ఉద్యోగ్ సంస్థ నిర్వహిస్తుంది. అందులో అన్ని కంపెనీలకు చెందిన ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ప్లాంటును ప్రారంభించిన కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చింది. దీని ద్వారా దేశంలో పర్యావరణాన్ని కాపాడేందుకు వీలవుతుంది. టాటా మోటార్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్లాంటులో దశలవారీగా పాత వాహనాలను స్క్రాప్ చేసి మెరుగైన ఇంధన సామర్థ్యం కలిగిన వాహనాల సంఖ్యను పెంచాలని గడ్కరీ చెప్పారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్లాంటును ఏర్పాటు చేసినందుకు కంపెనీని అభినందిస్తున్నాను. భవిష్యత్తులో భారత్‌ను దక్షిణాసియా ప్రాంతంలోనే వాహన్ స్క్రాపింగ్ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నించాలని, దేశీయంగా ఇంకా మరిన్ని ఇలాంటి రీసైక్లింగ్ యూనిట్లు అవసరమని గడ్కరీ పేర్కొన్నారు.

Tags:    

Similar News