EV Car: వచ్చే ఏడాదిలో సుజుకి, టయోటాల తొలి ఈవీ కారు విడుదల
మొదటి ఈవీ ఎస్‌యూవీని గుజరాత్‌లోని సుజుకి ప్లాంట్‌లో తయారు చేయనున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: జపాన్ వాహన తయారీ కంపెనీలైన సుజుకి మోటార్, టయోటా మోటార్ వచ్చే ఏడాది తమ తొలి ఈవీ కారును తీసుకురానున్నట్టు వెల్లడించాయి. ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ మొదటి ఈవీ ఎస్‌యూవీని గుజరాత్‌లోని సుజుకి ప్లాంట్‌లో తయారు చేయనున్నాయి. ఈ వాహనం భారత మార్కెట్‌తో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి కానున్నాయి. అత్యధునికమైన డ్రైవింగ్ ఫీచర్లతో పాటు క్రూజింగ్ రేంజ్, సౌకర్యవంతమైన కేబిన్‌తో ఈవీ ఎస్‌యూవీ మోడల్‌ను తీసుకొస్తామని ఇరు కంపెనీలు బుధవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సుజుకి మోటార్(జపాన్) ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకి.. సుజుకి మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని(బీఈవీ) ప్రపంచవ్యాప్తంగా టయోటా కంపెనీ సరఫరా చేయనుంది. రెండు కంపెనీల మధ్య సహకారం మరింత బలోపేతం చేస్తూ కార్బన్-న్యూట్రల్ వాహనాల విస్తరణను పెంచేందుకు పనిచేయనున్నట్టు చెప్పారు. 2016 నుంచి ఇరు సంస్థలు కలిసి జపాన్, భారత్, యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు విస్తరించామని టయోటా ప్రెసిడెంట్ అకియో టయోడా పేర్కొన్నారు.