కూతురు కోసమే ఈ పథకం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన స్కీమ్ ఇది!
Sukanya Samruddhi Yojana: కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ప్రత్యేకమైన పథకమును అందిస్తోంది. దీని పేరు సుకన్య సమృద్ధి యోజన(Sukanya Samruddhi Yojana).

దిశ, వెబ్ డెస్క్: Sukanya Samruddhi Yojana: కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ప్రత్యేకమైన పథకమును అందిస్తోంది. దీని పేరు సుకన్య సమృద్ధి యోజన(Sukanya Samruddhi Yojana). ఈ పథకం 10ఏళ్ల లోపు ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. దీనిలో చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమును తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
2022లెక్కల ప్రకారం దేశంలో సుమారు 4.5కోట్ల మంది పేదరికంతోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల పల్లెల్లో అమ్మాయిలను మధ్యలోనే చదువు మాన్పించడం, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం వంటి అంశాలు ఈ పేదరికానికి కారణంగా నిలుస్తున్నాయి. ఈనేపథ్యంలో మహిళలు పురోభివ్రుద్ధి, సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నాయి.
దేశంలోని లక్షలాది బాలికలకు సాధికారత కల్పించేందుకు సుకన్య సమృద్ధి యోజన స్కీమును ప్రవేశపెట్టారు. 2015 జనవరి 22వ తేదీన ప్రారంభం అయ్యింది. దేశవ్యాప్తంగా గత నవంబర్ నాటికి 4.10 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి యోజన(Sukanya Samruddhi Yojana) ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఇంట్లో అమ్మాయి పుట్టిన వెంటనే ఈ అకౌంట్ తీసుకోవచ్చు. పాపకు 10ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. కనీసం రూ. 250 ఈ అకౌంట్ ను అమ్మాయిల పేరుతో తల్లిదండ్రులు, సంరక్షకులు తీసుకోవచ్చు. అకౌంట్ తీసుకున్నప్పటి నుంచి ప్లాన్ మెచ్చూర్ అయ్యేంత వరకు లేదా ఖాతా మూసివేసే వరకు ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రతి అమ్మాయికీ ఒక అకౌంట్ కే అనుమతిస్తారు. తల్లిదండ్రులు తమ అమ్మాయిల కోసం గరిష్టంగా రెండు అకౌంట్స్ తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక మినహాయింపులు కూడా పొందవచ్చు. కవలలు పుట్టినా, ఒకే కాన్పులో ముగ్గురు పుట్టినా సంబంధిత ఆధారాలను సమర్పించడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
పోస్టాఫీసులో లేదా వాణిజ్య బ్యాంకుల్లో ఈ అకౌంట్ తీసుకోవచ్చు. అకౌంట్ తీసుకునేందుకు అమ్మాయికి సంబంధించి జనన ధ్రువీకరణ పత్రం, నివాస రుజువును సమర్పించాలి. కనీస డిపాజిట్ రూ. 250. ఆపై రూ. 50 చొప్పున 300, 350, 400, 450, 500 ఇలా మీ స్థోమతను బట్టి డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఆర్థిక ఏడాది మొత్తానికి ఈ డిపాజిట్ లిమిట్ రూ. 1,50, 000 మించి ఉండకూడదు. అకౌంట్ తీసుకున్నప్పటి నుంచి 15ఏళ్ల వరకు డిపాజిట్ చేసుకోవాలి. ఆడపిల్లకు 18ఏళ్లు వచ్చేంత వరకు ఈ అకౌంట్ ను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చేతుల్లోనే ఉంటుంది.
21ఏళ్లు పూర్తి అయిన తర్వాత ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు. అంటే అమ్మాయికి 18ఏళ్లు నిండి 21ఏళ్ల లూపే పెళ్లి చేయాలనుకుంటే ఈ స్కీమ్ మెచ్యూర్ కాకముందే క్లోజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకానికి ప్రభుత్వం 8.2శాతం వడ్డీ చెల్లిస్తుంది.