వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరింత నష్టాలను చూస్తున్నాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరింత నష్టాలను చూస్తున్నాయి. బుధవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ఆ తర్వాత క్రమంగా బలహీనపడ్డాయి. ముఖ్యంగా దేశీయ బ్యాంకింగ్ ఫైనాన్స్, ఐటీ రంగాల్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కారణంగా మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మిడ్-సెషన్ సమయంలో స్వల్ప నష్టాలను చూసిన మార్కెట్లు చివరి గంటలో అమ్మకాలతో బలహీనపడ్డాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 344.29 పాయింట్లు నష్టపోయి 57,555 వద్ద, నిఫ్టీ 71.15 పాయింట్లు కోల్పోయి 16,972 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఫార్మా రంగాలు పుంజుకోగా, బ్యాంకింగ్, మీడియా రంగాలు ఎక్కువగా నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, టాటా స్టీల్, టైటాన్, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, అల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.
భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. విదేశీ బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ కారణంగా భారత కరెన్సీ రూపాయి విలువ బలహీనపడింది. ఈ కారణంగానే అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.81గా ఉంది.