వరుసగా ఏడో రోజూ నష్టపోయిన సూచీలు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి

Update: 2023-02-27 12:28 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రభావానికి తోడు దేశీయంగా అమ్మకాల ఒత్తిడి పెరిగిన కారణంగా సూచీలు వరుసగా ఏడవ రోజు పతనమయ్యాయి. దీనివల్ల కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్, నిఫ్టీ రెండూ నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఆందోళనలు, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు దూకుడును కొనసాగిస్తుండటంతో మదుపర్ల సెంటిమెంట్ల దెబ్బతింటోంది. సోమవారం ట్రేడింగ్‌లో అమెరికా, యూరప్ మార్కెట్లు కొంత సానుకూల ర్యాలీ చూపినప్పటికీ, మన మార్కెట్లలో కీలక రంగాల్లో అమ్మకాలు పెరగడం, అదానీ గ్రూప్ కంపెనీల బలహీనత మరింత ఒత్తిడిని పెంచడం వల్ల నష్టాలు కొనసాగాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 175.58 పాయింట్లు కుదేలై 59,288 వద్ద, నిఫ్టీ 73.10 పాయింట్లు కోల్పోయి 17,392 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు రాణించగా, మీడియా, మెటల్, ఐటీ రంగాల బలహీనపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టీసీఎస్, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.79 వద్ద ఉంది.

Tags:    

Similar News