వాహన పరిశ్రమలో ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత: మారుతీ సుజుకి!
ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా సమస్యలు ఉన్న కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల ఉత్పత్తి తగ్గనుందని అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి తెలిపింది
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా సమస్యలు ఉన్న కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల ఉత్పత్తి తగ్గనుందని అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల ఉత్పత్తి క్షీణించిందని, గతంలో సెమీకండక్టర్, చిప్‌ల కొరతను ఎదుర్కొన్న పరిశ్రమకు ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుందని, తద్వారా వాహనా తయారీ నెమ్మదించవచ్చని సోమవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
2022-23లో కంపెనీ రికార్డు స్థాయిలో 19.22 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇది నిర్దేశించుకున్న 20 లక్షల యూనిట్ల కంటే కొంచెం తక్కువ. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం ప్యాసింజర్, లైట్ కమర్షియల్ వాహనాల ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. ఈ పరిణామాల వల్లనే గతేడాది మార్చి కంటే ఈసారి 6 శాతం ఉత్పత్తి తగ్గి 1.54 లక్షల యూనిట్లకు పరిమితమైంది. మిగిలిన కాంపాక్ట్, యుటిలిటీ, కమర్షియల్ వాహనాల విభాగాల్లోనూ ఉత్పత్తి దెబ్బతిన్నది.
గత కొన్నేళ్ల నుంచి పరిశ్రమ ఎదుర్కొంటున్న చిప్‌ల సమస్య ఇంకా కొనసాగుతున్న సమయంలోనే ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కొంత ఇబ్బందికరమేనని, అయితే ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం చేస్తున్న ఖర్చు ద్వారా వాహనాల గిరాకీకి మద్దతివ్వనుందని కంపెనీ పేర్కొంది.