నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు

ఐటీ రంగం షేర్లలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం, వరుస నష్టాల తర్వాత కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.

Update: 2024-03-14 11:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతకుముందు సెషన్‌లో రికార్డు పతనంతో దెబ్బతిన్న సూచీలు గురువారం ట్రేడింగ్‌లో నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. ప్రధానంగా ఐటీ రంగం షేర్లలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం, వరుస నష్టాల తర్వాత కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కీలక రంగాలు, స్మాల్, మిడ్ క్యాప్‌లు పుంజుకోవడం, అదానీ గ్రూప్ కంపెనీలు ర్యాలీ చేయడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 335.39 పాయింట్లు లాభపడి 73,097 వద్ద, నిఫ్టీ 153.30 పాయింట్ల లాభంతో 22,151 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా రంగాలు 1 శాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ, టీసీఎస్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.84 వద్ద ఉంది. అధిక నష్టాల నుంచి మార్కెట్లు కోలుకోవడంతో మదుపర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ. 7.93 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.380.1 లక్షల కోట్లకు చేరుకుంది. 


Similar News