చివరి గంట వరకు ఉత్కంఠ.. ఆఖరికి స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మూడు రోజుల నష్టాల తర్వాత స్వల్ప లాభాలను సాధించాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మూడు రోజుల నష్టాల తర్వాత స్వల్ప లాభాలను సాధించాయి. గురువారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచి కొద్దిసేపు ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్-సెషన్ తర్వాత సానుకూలంగా ర్యాలీ చేశాయి. అమ్మకాల ఒత్తిడి కారణంగా చివరి గంట వరకు స్టాక్ మార్కెట్లు ఊగిసలాట ధోరణిలో కదలాడిన తర్వాత తక్కువ లాభాలకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా ప్రతికూల సంకేతాలు ఉండటం, విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలను కొనసాగించడం కూడా మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 64.55 పాయింట్లు లాభపడి 59,632 వద్ద, నిఫ్టీ 5.70 పాయింట్లు పెరిగి 17,624 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో రంగాలు రాణించాయి. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు లాభాలను చూశాయి. హిందూస్తాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, అల్ట్రా సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.16 వద్ద ఉంది.
Also Read..