భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి చేర్చే వరకు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ చీఫ్ ప్రకటనతో మార్కెట్లు పతనాన్ని చూశాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి చేర్చే వరకు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ చీఫ్ ప్రకటనతో మార్కెట్లు పతనాన్ని చూశాయి. సోమవారం ఉదయం నుంచే నష్టాలతో మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రభావం కారణంగా రోజంతా కోలుకోలేకపోయాయి. దీనికితోడు డాలర్ 20 ఏళ్ల గరిష్ఠానికి చేరడంతో భారత కరెన్సీ రూపాయి బలహీనంగా మారడం, ముడి చమురు ధరలు తిరిగి పెరగడంతో మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. ఇదే సమయంలో దిగ్గజ కంపెనీల షేర్లు సైతం ప్రతికూల ప్రభావంతో నష్టపోవడంతో సూచీలు దెబ్బతిన్నాయి.
ప్రధానంగా భారత ఈక్విటీ మార్కెట్లలో ఐటీ, ఫైనాన్స్ రంగాలు క్షీణించడంతో కీలక బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 58 వేల కంటే దిగువకు పడిపోయింది. గత వారాంతంలో ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఇన్వెస్టర్లు ఊహించిన దానికంటే కఠినంగా వడ్డీ రేట్ల పెంపు ప్రకటన చేయడంతో పెట్టుబడిదారులకు ఆర్థిక మాంద్యం ఆందోళనలు పెరిగాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లపై కూడా ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 861.25 పాయింట్లు పతనమై 57,972 వద్ద, నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయి 17,312 వద్ద ముగిశాయి.
నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ రంగం మాత్రమే రాణించగా, ఐటీ, మీడియా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు అధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, ఏషియన్ పెయింట్, ఐటీసీ, ఎంఅండ్ఎం లాభాలను దక్కించుకోగా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, అసీఐసీఐ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.91 వద్ద ఉంది. ఫెడ్ చీఫ్ ప్రకటనతో ఓ దశలో రూపాయి మారకం విలువ ఓ దశలో రూ. 80.13తో ఆల్‌టైమ్ రికార్డు పతనాన్ని చూసినప్పటికీ తర్వాత కోలుకున్నాయి.