రెండోరోజూ కొనసాగిన స్టాక్ మార్కెట్ నష్టాలు

సానుకూల తయారీ పీఎంఐ డేటా, రాబోయే త్రైమాసిక ఫలితాల మద్దతుతో నష్టాలు తగ్గాయి.

Update: 2024-04-03 11:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. బలహీనమైన అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీ, పెరిగిన ముడి చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల నుంచి నిధులు ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలతో సూచీలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అమెరికాలో వెలువడిన గణాంకాలతో వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యమవుతుందనే అంచనాలతో గ్లోబల్ మార్కెట్లు నీరసించాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై పడటంతో బలహీనపడ్డాయి. అయితే, సానుకూల తయారీ పీఎంఐ డేటా, రాబోయే త్రైమాసిక ఫలితాల మద్దతుతో నష్టాలు తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 27.09 పాయింట్లు నష్టపోయి 73,876 వద్ద, నిఫ్టీ 18.65 పాయింట్లు క్షీణించి 22,434 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మీడియా రంగాలు రాణించాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, యాక్సి బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.46 వద్ద ఉంది. 

Tags:    

Similar News