Stock Market: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న భారీ నష్టాలు

గ్లోబల్ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2 శాతం కంటే ఎక్కువ పెరగడంతో భారత స్టాక్ మార్కెట్ల పతనానికి దోహదపడింది.

Update: 2024-10-07 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. గతవారం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ తీవ్రత పెరగడం, చైనా మార్కెట్ల ర్యాలీతో మన మార్కెట్ల నీరసించాయి. ఆ ప్రభావం ఈ వారం కూడా కొనసాగడంతో పాటు విదేశీ మదుపర్లు మన మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల సూచీలు అధిక నష్టాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2 శాతం కంటే ఎక్కువ పెరగడంతో భారత స్టాక్ మార్కెట్ల పతనానికి దోహదపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 638.45 పాయింట్లు కుదేలై 81,050 వద్ద, నిఫ్టీ 218.85 పాయింట్లు నష్టపోయి 24,795 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం మినహా అన్ని రంగాలు క్షీణించాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్, మీడియా రంగాలు 3 శాతానికి పైగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.99 వద్ద ఉంది. 

Tags:    

Similar News