SBI: ఎస్‌బీఐ అరుదైన ఘనత.. రూ. 5 లక్షల కోట్లు దాటిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్
ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అరుదైన ఘనతను దక్కించుకుంది..Latest Telugu News
ముంబై: ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అరుదైన ఘనతను దక్కించుకుంది. మార్కెట్ విలువ పరంగా మొదటిసారిగా రూ. 5 లక్షల కోట్లను అందుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది. అంతేకాకుండా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మూడో బ్యాంకుగా అవతరించింది.
అన్ని కంపెనీలతో కలుపుకుని మార్కెట్ విలువ జాబితాలో ఏడో స్థానంలో ఉంది. బుధవారం స్టాక్ మార్కెట్లలో ఎస్‌బీఐ షేర్ ధర 1 శాతం కంటే ఎక్కువ లాభపడటం తో బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 5.11 లక్షల కోట్లకు చేరుకుంది. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఎస్‌బీఐ బ్యాంకు షేర్ 17 శాతానికి పైగా పుంజుకుంది. గత ఏడాది కాలంలో బ్యాంకు షేర్ 32 శాతం లాభపడింది. అదే మూడు నెలల్లో 26 శాతం, రెండు నెలల కాలంలో 16 శాతం పెరగడం గమనార్హం.
ఇటీవల ఆర్‌బీఐ వెలువరించిన గణాంకాల్లో ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకుల షేర్లు లాభపడంతో రుణాల వృద్ధి పెరుగుతోందని పేర్కొంది. అలాగే దేశీయ బ్యంకుల రుణాలు 9 ఏళ్ల గరిష్ఠానికి చేరడం కూడా ఎస్‌బీఐ దూసుకెళ్లడానికి కారణమని విశ్లేషకులు తెలిపారు. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ 2 శాతానికి పైగా లాభపడి రూ. 570.5 వద్ద కొనసాగింది.