భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచిన రష్యా
ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం, మార్చి నెలలో రష్యా నుంచి భారత్ రోజుకు 1.36 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం, మార్చి నెలలో రష్యా నుంచి భారత్ రోజుకు 1.36 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది గత నెలతో పోలిస్తే 7 శాతం ఎక్కువ. ఫిబ్రవరిలో భారత్ తన అవసరాలకు రష్యా నుండి రోజుకు 1.27 మిలియన్ బ్యారెల్స్ (బిపిడి) దిగుమతి చేసుకుంది. ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా ప్రకారం ఇరాక్, సౌదీ అరేబియాతో సహా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న దానితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. భారత్ మొత్తం ముడి చమురు దిగుమతి ఫిబ్రవరిలో 4.41 మిలియన్ బిపిడి నుండి నెలలో 4.89 మిలియన్ బిపిడికి పెరిగింది.
చమురు విక్రయాల ద్వారా వస్తున్న రష్యా ఆదాయాన్ని తగ్గించేందుకు, రష్యా ఎగుమతులపై ధర పరిమితిని ఉల్లంఘించినందుకు మాస్కోకు చెందిన షిప్పర్ సోవ్‌కామ్‌ఫ్లాట్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. అయినప్పటికి కూడా రష్యా మిగతా దేశాల కంటే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలవడం గమనార్హం. మధ్య-ప్రాచ్య దేశాల సరఫరాదారులలో ఇరాక్ నుంచి భారత్ 1.09 మిలియన్ బిపిడి ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది అంతకు ముందు నెలలో 76,000 బిపిడిగా ఉంది.
సౌదీ అరేబియా నుంచి మార్చిలో 76,000 బిపిడి చమురు దిగుమతి చేసుకోగా, ఇది ఫిబ్రవరిలో 82,000 bpd నుండి క్షీణించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన వినియోగదారులలో ఒకటైన భారతదేశం, 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి రష్యా నుండి ముడి చమురు దిగుమతులను పెంచింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ముందు, భారతదేశం మొత్తం ముడి చమురులో 0.2 శాతం మాత్రమే పొందేది. ఇప్పుడు అది భారీగా పెరిగింది.