FPI: జులై 26 నాటికి భారత ఈక్విటీల్లోకి రూ.33 వేల కోట్ల ఎఫ్‌పీఐలు

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడటానికి భారత్ కృషి చేస్తున్న తరుణంలో దానికి మద్దతుగా విదేశీ పెట్టుబడిదారులు సైతం భారీగా భారత ఈక్విటీల్లో కొనుగోళ్లు జరుపుతున్నారు

Update: 2024-07-27 08:20 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడటానికి భారత్ కృషి చేస్తున్న తరుణంలో దానికి మద్దతుగా విదేశీ పెట్టుబడిదారులు సైతం భారీగా భారత ఈక్విటీల్లో కొనుగోళ్లు జరుపుతున్నారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ నుంచి వచ్చిన తాత్కాలిక డేటా ప్రకారం, జులై నెలలో 26 నాటికి ఈక్విటీలో రూ.33,688 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాగే, డెట్ మార్కెట్లోకి రూ.19,222 కోట్లు వచ్చాయి. దీంతో, మొత్తం ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు రూ. 52,910 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి రావడం, యూనియన్ బడ్జెట్ 2024-25 కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారీగా ఇన్వెస్ట్ చేశారు.

అయితే ఇటీవల బడ్జెట్‌లో స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్నును 15 శాతం నుంచి 20 శాతానికి, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. దీంతో ఇది ఎఫ్‌పీఐలకు పెద్ద అడ్డంకిగా మారి తమ పెట్టుబడులు తిరిగి ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ధోరణి స్వల్ప కాలికంగా మాత్రమే ఉంటుందని, రాను రాను ఈక్విటీల్లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల ఆందోళనలతో మే నెల రూ. 25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

Tags:    

Similar News