RIL: తగ్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలు
ప్రధాన పెట్రో కెమికల్, చమురు శుద్ధి వ్యాపారాల్లో డిమాండ్, సరఫరా దెబ్బతినడంతో మొత్తంగా సంస్థ లాభాలపై ప్రభావం పడింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ లాభాలు తగ్గాయి. ప్రధాన పెట్రో కెమికల్, చమురు శుద్ధి వ్యాపారాల్లో డిమాండ్, సరఫరా దెబ్బతినడంతో మొత్తంగా సంస్థ లాభాలపై ప్రభావం పడింది. సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి రిలయన్స్ నికర లాభాలు 4.78 శాతం క్షీణించి రూ. రూ.16,563 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 17,394 కోట్ల లాభాలను ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.2,38,797 కోట్ల నుంచి రూ.2,40,357 కోట్లకు పెరిగాయి. సంస్థ భిన్న వ్యాపారాల్లో స్థిరమైన ఆదాయాలను సాధించింది. డిజిటల్ సేవలు, అప్‌స్ట్రీమ్(వినియోగ ఆధారిత) వ్యాపారాల్లో బలమైన వృద్ధిని చూశాం. అయితే, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, ఇతర కారణాలతో డిమాండ్, సరఫరా దెబ్బతినడం వల్ల ఆయిల్, పెట్రో కెమికల్ వ్యాపారాలు బలహీనంగా ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు. ఇక, సంస్థ టెలికాం విభాగం జియో సమీక్షించిన త్రైమాసికంలో రూ. 6,539 కోట్ల లాభాలతో 23.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. వినియోగదారుల నుంచి సగటు ఆదాయం(ఆర్పు) రూ. 14 పైగా పెరిగి రూ. 195.1కి పెరిగింది. ఇటీవల కంపెనీ టారిఫ్ ధరలు పెంచిన కారణంగా ఆర్పులో వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో జియో మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ 4.2 శాతం పెరిగి 47.9 కోట్లకు చేరుకుంది. జియో ఆదాయం రూ. 37,119 కోట్లుగా ఉంది.