526 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, గ్లోబల్ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జోరు సూచీల ర్యాలీకి దోహదపడ్డాయి. గోల్డ్‌మన్ శాక్స్ దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ కంపెనీల షేర్ల టార్గెట్ ధరను పెంచడంతో మార్కెట్లలో ఉత్సాహం పుంజుకుంది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, గ్లోబల్ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 526.01 పాయింట్లు ఎగసి 72,996 వద్ద, నిఫ్టీ 118.95 పాయింట్లు లాభపడి 22,123 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్టీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, మారుతీ సుజుకి, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. రిలయన్స్ సంస్థ ఏకంగా 3.60 శాతం పుంజుకోవడం విశేషం. విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఎస్‌బీఐ, నెస్లె ఇండియా కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.33 వద్ద ఉంది.